అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించాలి : జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి

by Aamani |
అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే నియంత్రించాలి : జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి
X

దిశ,శేరిలింగంపల్లి : అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేంక్షించవద్దని వాటి విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. జోన్‌ స్థాయిలో పట్టణ ప్రణాళిక విభాగంపై శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించాలని ఆదేశించారు. వీటిపై చర్యల విషయంలో అధికారులు ఎటువంటి తప్పిదాలకు పాల్పడ్డా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్కిల్‌ స్థాయిలో ఎస్టీఎఫ్‌ల పనితీరు, కోర్టు కేసులు, ఆర్‌టీఐ, లోకాయుక్త, రహదారి విస్తరణ, టీఎస్ బీపాస్ లో అనుమతుల ప్రక్రియ, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చే వినతులు, ప్రభుత్వ స్థలాలు, జీహెచ్‌ఎంసీ పార్కులు, ఫుట్‌ పాత్‌ లు, నాలాల ఆక్రమణలపై జోనల్ కమిషనర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతుల జారీని ప్రభుత్వం సులువు చేసినందున నిర్మాణ దారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని, అందుకు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చి తక్షణమే నిలిపివేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించిన కోర్టు కేసులలో కౌంటర్‌లను సకాలంలో ఫైల్‌ చేయాలని, ఏమాత్రం జాప్యం లేకుండా చూడాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారానికి గాను రహదారి విస్తరణను ప్రాధాన్యతగా చేపట్టాలని, ఇందుకోసం ఆస్తుల గుర్తింపు, సేకరణను వేగవంతం చేయాలన్నారు.

కోర్టు కేసులలో ఉన్న స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు జరగవద్దని, పర్యవేక్షణ, చర్యల పరంగా నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపేందర్‌రెడ్డి హెచ్చరించారు. నిర్మాణాల పరంగా క్షేత్రస్థాయిలో తనిఖీలను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని, కార్యాలయాలలో కూర్చుని అనుమతులు మంజూరు చేసే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్యామ్‌కుమార్‌, డీసీలు, ఏసీపీలు, టీపీఎస్, న్యాక్‌ ఇంజినీర్లు, ఎస్టీఎఫ్‌ అధికారులు, చైన్మెన్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed