మంత్రి చీకటి దందాను అడ్డుకున్నందుకే అక్రమ కేసులు

by Sridhar Babu |   ( Updated:2023-09-04 13:02:45.0  )
మంత్రి చీకటి దందాను అడ్డుకున్నందుకే అక్రమ కేసులు
X

దిశ,కార్వాన్ : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ (డీసీఎంఎస్), బీసీ నేత వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్ పై నిరాధారంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. సూర్యాపేటలో అన్ని పోలీసు స్టేషన్లలో ఏకకాలంలో కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలనే కుట్రతోనే మంత్రి తన అనుచరులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. బీసీ నాయకుని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైన చర్యగా అభివర్ణించారు.

వట్టే జానయ్య యాదవ్ పై పోలీసులు అక్రమ కేసులను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జానయ్యకు మంత్రి జగదీష్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందని, తక్షణమే ఆయనకు పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమకారిణి బెల్లి లలితను కిరాయి హంతకులతో అంతమొందించినట్లే జానయ్యను చంపేందుకు మంత్రి కుట్ర పన్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జెండాలు మోసే బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిరుగుబాటు చేసి,తమ పదవులకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. పోలీసులు కేవలం ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటలిజెన్స్ వ్యవస్థను తన స్వార్దం కోసం వాడుకుంటున్నారన్నారని ఆరోపించారు. ఇంటలిజెన్స్ అధికారులు కేసీఆర్

ఇంటికి మాత్రమే ఇంటలిజెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ప్రభుత్వం ట్యాప్ చేస్తుందన్నారు. అందుకే పోలీసు అధికారి దుగ్యాల ప్రణీత్ రావు కు ప్రమోషన్ ఇచ్చారని అన్నారు. తక్షణమే దుగ్యాల ప్రణీత్ రావు ప్రమోషన్ పై విచారణ జరపాలని డిమండ్ చేశారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమంగా కట్టబెడుతున్నారని అన్నారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనన్నారు. 99 శాతం పేదలకు

అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమని ప్రకటించారు. త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది కేవలం బీజేపీ నినాదంగా మిగులుతుంది తప్ప భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశానికి జమిలీ ఎన్నికలు ప్రయోజనకరం కాదన్నారు. జమిలీ ఎన్నికల వల్ల రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయని అన్నారు. బీఅర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ డా.వెంకటేష్ చౌహన్, ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్, అధికార ప్రతినిధులు జక్కని సంజయ్, అరుణ క్వీన్, రాష్ట్ర నాయకులు అభియేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story