హైడ్రాకు ఆదిలోనే అడ్డంకులు

by Mahesh |
హైడ్రాకు ఆదిలోనే అడ్డంకులు
X

దిశ, సిటీబ్యూరో: ట్రైసిటీ పరిధిలోని సర్కార్ ఆస్తులను కాపాడటం తో పాటు మరింత పటిష్టంగా విపత్తుల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటైన హైడ్రాకు ఆదిలోనే అడ్డంకులెదురవుతున్నాయి.ట్రైసిటీ పరిధిలోని సర్కార్ ఆస్తులను కాపాడటం తో పాటు మరింత పటిష్టంగా విపత్తుల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటైన హైడ్రాకు ఆదిలోనే అడ్డంకులెదురవుతున్నాయి.హైడ్రా ఏర్పాటే చట్టవిరుద్ధమని, ఏర్పాటుకు జీహెచ్ఎంసీలోని స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ తీర్మానాలు ఏమైనా ఉన్నాయా? అంటూ మజ్లిస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో హైడ్రా ఏర్పాటుకు ఎలాంటి ప్రొవిజినల్ లేదని, హైడ్రాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ షేక్‌పేట కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఫరాజుద్దిన్ నేతృత్వంలో ఏడుగురు మజ్లిస్ కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జీహెచ్ఎంసీకి ప్రధాన బాస్ మేయరేనని, ఆ పదవికి సమాంతరంగా మరో హోదా లేదని వ్యాఖ్యానించారు.

హైడ్రా ఏం చేస్తున్న ముందస్తు సమాచారం కూడా మేయర్‌కు ఇవ్వకపోవటం సబబుగా లేదన్నారు. జీహెచ్ఎంసీ నిధులతో ఇప్పటికే ఈవీడీఎంకు జీతాలు, ఇతర ఖర్చులు చేస్తున్నామని, జీహెచ్ఎంసీ చట్టంలోని హైడ్రాకు జీహెచ్ఎంసీ ఆదాయం నుంచి ఎలాంటి నిధులు కేటాయించరాదని, హైడ్రాను వెంటనే రద్దు చేసేందుకు స్టాండింగ్ కమిటీలో, కౌన్సిల్‌లో చర్చ జరగాలని కోరినట్లు వెల్లడించారు. పైగా హైడ్రాను పటిష్టపరిచేందుకు 259 మంది పోలీసు ఆఫీసర్ల క్యాడర్ స్ట్రెంథ్‌ను ప్రకటించడాన్ని తప్పబడుతున్నారు. మహానగరంలో అధికార పార్టీ కన్నా అత్యంత ప్రాబల్యం కల్గిన మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తున్న హైడ్రా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయా? లేక ఆదిలోనే హంసపాదు అన్నట్టు నిలిచిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యతిరేకతకు ఈ పరిణామమే కారణమా?..

ఇటీవల రాజేంద్రనగర్‌లోని చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మజ్లిస్ పార్టీ బహదూర్‌పురా ఎమ్మెల్యే మొబిన్‌కు చెందిన ఓ నిర్మాణం కూడా ఉండటం, దాన్ని నేలమట్టం చేయడాన్ని అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే, ఇద్దరు కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లిస్ ప్రజాప్రతినిధులు హైడ్రా ని వ్యతిరేకించేందుకు ఈ పరిణామమే ఓ కారణమా? అన్న అనుమానాలు సైతం లేకపోలేవు. జీహెచ్ఎంసీ చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసుల పాత్ర కేవలం విజిలెన్స్ వరకేనంటూ వాదనలున్నాయి. పైగా హైదరాబాద్ మహానగరంలోని 19.5 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులు చెల్లించే పన్నుతో పౌర సేవల నిర్వహణ, అభివృద్ధి చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఎందుకు హైడ్రాకు నిధులివ్వాలంటూ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

మహానగరంలోని చెరువులు, నాలాలు గడిచిన 45 ఏళ్లలో 61 శాతం కబ్జాకు గురయ్యాయని, మిగిలిన 39 శాతం చెరువులను, నాలాలను కాపాడుకోవల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఆక్రమణల తొలగింపునకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ముఖ్యమని వ్యాఖ్యానించిన హైడ్రా ఇప్పుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సహకరించకపోగా, కూల్చివేతలను, ఆక్రమణలు తొలగింపులను క్షేత్రస్థాయిలో అడ్డుకునే అవశాలెక్కువయ్యాయన్న అభిప్రాయాలు లేకపోలేవు. పైగా హైడ్రా కార్యకలాపాలపై త్వరలోనే స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్‌లో చర్చించాలని పట్టుబట్టడంతో ఈ పరిణామం ఎన్ని మలుపులు తిరుగుందో వేచిచూడాలి. గతంలో ఈవీడీఎం కొత్తగా ఏర్పడిన తర్వాత డీఫేస్ యాక్ట్ కింద చిన్న చిన్న ప్రకటనల కూడా అప్పటి ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ప్రస్తుత హైడ్రా మాదిరిగానే దాదాపు రూ.133 కోట్ల విలువైన సుమారు రెండు లక్షల ఛలానాలు జనరేట్ చేసి, కేవలం రూ.13 కోట్ల వరకు జరిమానాల నగదును వసూలు చేశారు. అప్పట్లో కూడా ఈవీడీఎం దూకుడుపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగి, ఈవీడీఎంను రద్దు చేయాలని తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు కూడా హైడ్రాకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story