HYDRA: మరోసారి యాక్షన్‌లోకి దిగిన ‘హైడ్రా’.. కావూరి హిల్స్‌లో కూల్చివేతలు షురూ

by Shiva |
HYDRA: మరోసారి యాక్షన్‌లోకి దిగిన ‘హైడ్రా’.. కావూరి హిల్స్‌లో కూల్చివేతలు షురూ
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులు (Lakes), నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Asset Protection Agency)కు ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్‌లో ఆ సంస్థ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం మాదాపూర్ (Madhapur) ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చేందుకు ప్రొక్లెయినర్ల(proclainers)తో అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. ముందుగా కావూరి హిల్స్ (Kavuri Hills) లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.

అయితే, కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కావూరి హిల్స్‌లోని పార్క్ స్థలంలో ఓ స్పోర్ట్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. అయితే, వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. అయితే, పార్క్‌లో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇటీవలే స్థానికులు విషయాన్ని హైడ్రా దృష్టి తీసుకెళ్లగా ఇవాళ అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చేసి కావూరి హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు అక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, పార్క్ స్థలాన్ని తాము 25 ఏళ్లకు గాను లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు పేర్కొన్నారు. గడువు ముగియక ముందే అన్యాయంగా తమ నిర్మాణాలను తొలగించారని వారు ఆరోపించారు.

కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు హైడ్రా అధికారులు అమీన్‌పూర్ (Ameenpur), కూకట్‌పల్లి (Kukatpally) ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. నల్లచెరువు (Nalla Cheruvu)కు సంబంధించి 4 ఎకరాల బఫర్ జోన్‌ (Buffer Zone)లో ఉన్న 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్లను కూల్చివేశారు. ఇక ఎఫ్టీఎల్‌లోని 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 25 పక్కా భవనాలు, 16 తాత్కాలిక షెడ్లను తొలగించారు. అదేవిధంగా అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ (Kishtareddy Pet) సర్వే నెంబర్ 164లో ఉన్న అపార్ట్‌మెంట్ల కూల్చివేత ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.

Next Story

Most Viewed