Telangana Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. థర్మల్‌ పవర్ ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయం!

by Shiva |
Telangana Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. థర్మల్‌ పవర్ ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పెద్దపల్లి జిల్లా (Peddapally District) రామగుండం (Ramagundam) ప్రాంతంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ (Super Critical Technology)తో సింగరేణి, జెన్‌కో సంయుక్తంగా నూతన థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించనుంది. అయితే, ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను సింగరేణి సంస్థతో కలిసి రూపొందించాలని స్టేట్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్, జెన్‌కో (GENCO)కు ఉత్తర్వులను జారీ చేసింది. అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పూర్తి డీపీఆర్‌(DPR) ను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, రామగుండంలో ఇది వరకే జెన్‌కోకు సంబంధించి 62.5 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు ఉన్నప్పటికీ అది శిథిలావస్థకు చేరడంతో అందులో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలోనే అందులో పని చేసిన ఉద్యోగుల నుంచి కొత్త థర్మల్ ప్లాంట్ నిర్మించాలని భారీగా విజ్ఞప్తులు రావడంతో తాజాగా ప్రభుత్వం కొత్త ప్లాంట ఏర్పాటుపై స్టేట్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ నుంచి జెన్‌కో (GENCO)కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో మొదటిది భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రం, అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది. ప్రస్తుతం ఆ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఆపరేటర్‌గా తెలంగాణ జెన్‌కో (GENCO) వ్యవహరిస్తోంది. ఇక రెండోది తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇది పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉంది. నేషనల్ థర్మల్ పవన్ కార్పొరేషన్ (NTPC) ఆ పవర్ ప్లాంట్‌కు ఆపరేటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అది పాతది అవ్వడంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. ఇక్కడే ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇక మూడోదైన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ప్రస్తుతం 80 శాతం పనులతో పవర్ ప్లాంట్ నిర్మాణ దశలో ఉంది.

Next Story

Most Viewed