Hyderabad Water Board: ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ

by Ramesh Goud |
Hyderabad Water Board: ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ
X

దిశ, సిటీబ్యూరో : జలమండలి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే. నెలవారి ఖర్చులకు ఆదాయానికి పొంతనలేదు. రూ.1,145 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఒక పక్కా బిల్లులు వసూలు చేయకపోవడం, మరో పక్కా మెజార్టీ బకాయిలు ప్రభుత్వం శాఖలకు సంబంధించినవే ఉండడంతో బోర్డు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటికి సంబంధించిన ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతోనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

డిమాండ్ రూ.120 కోట్లు..

జలమండలి పరిధిలో సుమారు 8 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 7 లక్షల కనెక్షన్లు జీరో బిల్లువే. కమర్షియల్, బల్క్, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బిల్లులు మాత్రమే వసూలవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్పతులకు సంబంధించిన బిల్లులు కూడా రావడంలేదు. దీంతోపాటు ఉచిత నీటి సరఫరాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదు. అయితే ఆర్టీసీ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యానికి ప్రభుత్వం చెల్లించినట్టుగానే జలమండలికి సైతం బకాయిలు చెల్లించాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓటీఎస్ పై నిర్లక్ష్యం..

దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జలమండలి అందుబాటులోకి తెచ్చిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకంపై అధికారులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదనే విమర్శలూలేకపోలేదు. రూ.1,255 కోట్ల బకాయిలకుగాను రెండు నెలలుగా రూ.110 కోట్లు మాత్రమే వసూలు చేశారు. డొమిస్టిక్‌, డొమిస్టిక్‌ స్లమ్‌, కమర్షియల్‌, ఇండస్ట్రీయల్‌, ఎంఎస్‌బీ, బల్క్‌, కాలనీలు, ప్రభుత్వ, కేంద్ర రంగ సంస్థలు కలిపి 7.18 లక్షల కనెక్షన్లకు ఓటీఎస్‌ వర్తింపైంది. వీటి నుంచి రూ.1,961 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.705 కోట్ల మేర వడ్డీ మాఫీ కానుంది. రూ.1,255 కోట్ల మేర బకాయిలు వసూలు చేయడమే లక్ష్యంగా ఓటీఎస్‌ను డివిజన్ల వారీగా పెద్దగా ప్రచారం చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. 2020లో రూ.250 కోట్లు వసూలైతే ఈసారి రూ.110 కోట్లే వసూలు కావడంపై విమర్శలొస్తున్నాయి.

కరెంట్ బిల్లులు రూ.130 కోట్లు..

జలమండలి పరిధిలో తాగునీటి సరఫరాలో భాగంగా కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ నీటిని తరలించడానికి, రిజర్వాయర్ల నుంచి సరఫరా చేయడానికి మొత్తం కరెంట్ బిల్లులకే రూ.130 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు, ఎయిర్‌టెక్ మిషన్లు, సిల్ట్ కార్టింగ్ వాహనాలు, ఇతర కార్యక్రమాలకు మరో రూ.100 కోట్లు కలిపి నెలకు ఖర్చులు రూ.230 కోట్లు అవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఎస్టీపీల నిర్వహణకు మరో రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా.

Advertisement

Next Story