- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hyderabad: 50 గజాల్లో 5 అంతస్తుల గాలిమేడ
దిశ, శేరిలింగంపల్లి : విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు.. 60 గజాల స్థలాల్లో 6 అంతస్థుల బిల్డింగ్‌లు.. ఒకరి గోడకు ఆనుకుని ఇంకో నిర్మాణం.. ఎక్కడా నిబంధనలు అనే మాటే లేదు.. కనీసం పక్క వారికి ఇబ్బంది అవుతుందన్న ధ్యాస లేదు. ఎవరికి వారుగా గాలి మేడలు కట్టేస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి సర్కిల్ 20లో 50 గజాల స్థలంలో కట్టిన 5 అంతస్థుల గాలిమేడ పక్కకు ఒరిగిన ఘటన అందులో నివసిస్తున్న వారినే కాదు చుట్టుపక్కల వారిని కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఒక్క ఘటన శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో అనుమతులు లేకుండా.. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా వెలుస్తున్న నిర్మాణాలు పరిస్థితి ఏంటి అనేందుకు అద్దం పడుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
సిద్దిక్ నగర్‌లో ఓ వైపునకు ఒరిగిన నిర్మాణం..
శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్‌లో ఓ వ్యక్తి 50 గజాల స్థలంలో 5 అంతస్థుల ఇళ్లు నిర్మించాడు. ఆ ఇంటికి ముందు పక్క మినహా ఎక్కడా కనీసం కిటికీ కూడా లేదు. వెంటిలేషన్ అనేది కూడా లేకుండా నిర్మాణం చేపట్టాడు. ఐదు అంతస్తుల్లో మొత్తం 10 గదులు ఉండగా వాటన్నిటిని కిరాయిలకు ఇచ్చి తాను మాత్రం మరోచోట నివాసం ఉంటున్నాడు. అందులో చాలా వరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు నివాసం ఉంటున్నారు. ఈ భవనం పక్కనే సుమారు 150 గజాల స్థలంలో యాసిన్ ఖాన్ అనే వ్యక్తి నిర్మాణం చేపట్టేందుకు బిల్డర్ శ్రీనివాస్‌కు అప్పగించాడు. బిల్డర్ శ్రీనివాస్ పుటింగ్‌లు తీయించాడు. దీంతో దాని పక్కనే ఉన్న 50 గజాల బిల్డింగ్ ఓ వైపుకు ఒరిగింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఎక్కడ ఆ భవనం కూలుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యారు. 50 గజాల బిల్డింగ్ 3వ ఫ్లోర్‌లో ఉంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన సాదిక్ హుస్సేన్ (26) పైనుంచి దూకడంతో అతని కాలికి, చేతికి, వెన్నుపూసకు దెబ్బ తగిలి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పాతదానికే కాదు కొత్త నిర్మాణానికి సైతం అనుమతులు లేవు..
50 గజాల స్థలంలో 5 అంతస్తులు పైన ఓ రేకుల షెడ్ వేసుకున్నప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ పక్కనే 150 గజాల స్థలంలో నిర్మాణం కోసం పుటింగ్‌లు తీసిన వ్యక్తి సైతం కనీసం జీహెచ్ఎంసీలో ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తుంది. ఇలాంటి నిర్మాణాలు సిద్దిక్ నగర్ ఏరియాలో వందల సంఖ్యలో ఉన్నాయి. చాలా నిర్మాణాలకు కనీస అనుమతులు లేవని తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డా టీపీఎస్ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని, కొందరు చోటామోటా నాయకులు కూడా అందినకాడికి దండుకుని అన్నీ తాము చూసుకుంటామని అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత..
సిద్దిక్ నగర్ కాలనీలో ఉన్న భవనం పక్కనే కొత్తగా ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ తవ్వగా పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. హైడ్రా ఉపయోగిస్తున్న హైడ్రాలిక్ మిషన్‌తో కూల్చివేత్తలు చేపట్టారు. అయితే మిషన్ డీజిల్ పైపు పగలడంతో కూల్చివేతలు మధ్యలో ఆగిపోయాయి.
ఊర్ల పొలం అమ్ముకుని వచ్చి కట్టుకున్నాం.. స్వప్న, బాధితురాలు
గ్రామంలో ఉన్న కాస్త పొలాన్ని అమ్ముకుని ఇళ్లు కట్టుకున్నాం. మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సెల్లార్ తవ్వారు. ఇప్పుడు మేము కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని సిద్దిక్ నగర్‌లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ యజమాని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి బేస్‌మెంట్‌కు ఆనుకుని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పెద్ద ఎత్తున గుంత తవ్వి పుట్టింగ్ వేయడంతో తమ ఇళ్లు పక్కకు ఒరిగిపోయింది. ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చాము. ఆ ఇంటి నిర్మాణం కోసం ఊర్లో ఉన్న పొలం కూడా అమ్మేశాము. ఇప్పుడు ఉన్న ఆదెరువు కూడా లేకుండా పోయింది. ఉండనీకి నీడ లేదు, రోడ్డున పడ్డాము. మాకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి, లేదంటే ఆత్మహత్యనే శరణ్యం అని బాధితురాలు స్వప్న కన్నీటి పర్యంతం అయింది.
ఒక్కొక్కరిది ఒక్కో బాధ..
ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిమల్ దాస్ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి భార్యా పిల్లలతో కలిసి ప్రస్తుతం పక్కకు ఒరిగిన భవనంలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి బిల్డింగ్ పక్కకు ఒరగడంతో భార్యా పిల్లలతో కలిసి బయటకు పరుగులు తీశాడు. ప్రస్తుతం వారు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. సామగ్రి, బట్టలు కూడా రూములోనే ఉన్నాయని, తమకు తినడానికి తిండి కూడా లేదని కన్నీరు పెట్టుకున్నారు. వీరే కాదు మరో తొమ్మిది గదుల్లో ఉన్న వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అధికారుల ఎంజాయ్..
ఓవైపు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్టు పక్కనే ఉన్న మరో భవనంలో కూర్చుని గేట్లు వేసుకుని టీలు తాగుతూ, టిఫిన్లు చేస్తూ ఫోన్లు చూసుకుంటూ కూర్చొవడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వచ్చి పక్కకు ఒరిగిన నిర్మాణాన్ని, పుటింగ్‌లు తవ్విన స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మిన్నకుండి చూసిన జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలంలో హడావుడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.