ఇదేం బీమా?.. జీహెచ్ఎంసీలో అమలుకానీ హెల్త్ ఇన్సూరెన్స్

by samatah |
ఇదేం బీమా?.. జీహెచ్ఎంసీలో అమలుకానీ హెల్త్ ఇన్సూరెన్స్
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక్కడ తిష్టవేసిన కొందరు అధికారులు ఉన్నతాధికారులు సాటి ఉద్యోగులనే మోసం చేసేందుకు దిగజారుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి పర్మినెంట్ ఉద్యోగుల బీమా పేరిట భారీగా నిధులు దారి మళ్లినట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన సుమారు నాలుగు వేల మంది పర్మినెంట్ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇటీవలే థర్డ్ పార్టీ సంస్థ ఎంపిక కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియలోనే అవకతవకలు జరిగినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా చికిత్సను అందించేందుకు గాను మొత్తం ఉద్యోగుల తరపున జీహెచ్ఎంసీ ఇన్సూరెన్స్ సంస్థకు నెల రోజుల క్రితం రూ.4.44 కోట్లను చెల్లించింది. అయినా అత్యవసర సమయంలో పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కావటం లేదని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఉద్యోగి, తనకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థను కోరగా, సదరు సంస్థ ప్రతినిధులు ఆస్పత్రికి వచ్చి కేవలం రూ.1500 చెల్లించి వెళ్లిపోయినట్లు బాధితుల కుటుంబ సభ్యులు వాపోయారు. తాజాగా ఉన్నట్టుండి ఆస్పత్రిపాలైన మరో ఉద్యోగి తాను జీహెచ్ఎంసీ ఉద్యోగినని, తనకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేసి, మెరుగైన వైద్యం అందించాలని ఇన్సూరెన్స్ సంస్థను కోరగా, చికిత్స చేయించుకుని, ఆస్పత్రిలో బిల్లులు చెల్లించిన తర్వాత తమకు బిల్లులు పంపితే అక్టోబర్‌లో బిల్లులు బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లిస్తామని సమాధానమిచ్చినట్లు బాధితులు వాపోయారు. పేద కుటుంబానికి చెందిన సదరు ఉద్యోగి వైద్యం చేయించుకునే స్తోమత లేక, ఇంటికెళ్లిపోయినట్లు సమాచారం.

చెల్లించిన ప్రీమియం ఏమైనట్టు?

నెల రోజుల క్రితం జీహెచ్ఎంసీలోని మొత్తం పర్మినెంట్ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఓ ఏజెన్సీని టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి ఆ సంస్థకు జీహెచ్ఎంసీ రూ.4.44 కోట్లను చెల్లించినట్లు సమాచారం. ప్రీమియం స్వీకరించిన ఏజెన్సీ పర్మినెంట్ ఎంప్లాయీస్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా, ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనా మొత్తం కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాల్సి ఉండగా, ఎందుకు అందించటం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు అధికారులు ప్రీమియం చెల్లించారా? లేదా? చెల్లిస్తే ఆ సంస్థ ఎందుకు ఎంప్లాయీస్‌కు ట్రీట్‌మెంట్ చేయించటం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

పొరుగు రాష్ట్రంలో నిషేధమున్న ఎజెన్సీ ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ సేవలందించేందుకు మార్కెట్‌లో అనేక రకాల సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ఏపీలో నిషేధమున్న సంస్థను జీహెచ్ఎంసీ అధికారుల ఎంపిక చేసి, భారీగా అమ్యామ్యాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. గత సంవత్సరం ఈ బాధ్యతలను నిర్వర్తించిన సంస్థకే ఈసారి కూడా టెండర్ల ప్రక్రియలో, టెండర్ల వేరే సంస్థకు ఖరారైన తర్వాత కూడా కొత్త సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు, వర్తమాన సంవత్సరానికి సంబంధించి రూ.4.44 కోట్లను కూడా కేటాయించినట్లు సమాచారం. కానీ సదరు సంస్థ ఉద్యోగులకు బీమా సేవలందించకపోవటంతో టెండర్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అధికారులు ప్రిమీయం ఎవరికి చెల్లించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాకు ముందు ఇదే తరహాలో హెల్త్ ఇన్సూరెన్స్ బాధ్యతలను పొందిన ఓ ఏజెన్సీ కొందరు యూనియన్ నేతలను దుబైపర్యటనకు తీసుకెళ్లి ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నియమించిన ఏజెన్సీ కనీస సేవలందించటం లేదని గతంలో ఉద్యోగులు ఫిర్యాదులు చేసినా, అధికారులు బుట్టదాఖలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story