పాతబస్తీలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్.. మెట్రో రెండో దశలో కీలక ముందడుగు

by Shiva |
పాతబస్తీలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్.. మెట్రో రెండో దశలో కీలక ముందడుగు
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనుల్లో ప్రభుత్వం మరో అడుగుముందుకేసింది. పాతబస్తీలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరో కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు 7.5కిలో మీటర్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 200 ఆస్తులకు డిక్లరేషన్ ప్రకటించారు.

రూ.24,269 కోట్లతో 76.4 కిలో మీటర్లు..

మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రూ.24,269 కోట్లతో 76.4 కిలో మీటర్లను ఐదు కారిడార్లలో ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. పార్ట్-ఏలో ఐదు కారిడార్లు, పార్ట్-బిలో ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ(స్కిల్ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. మొత్తం 116.4 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాబోయే నాలుగేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

కలెక్టర్ ఆమోదం..

ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్ గుట్ట వరకు 7.5 కిలో మీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల సేకరణ కీలకంగా మారింది. ఇప్పటికే భూసేకరణ కోసం హైదరాబాద్ మెట్రో సంస్థ నోటీసులు జారీచేసింది. అయితే 200 ఆస్తులను సేకరించనున్నారు. శనివారం ఆస్తుల సేకరణ డిక్లరేషన్‌కు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. దీంతో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి 2025లో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story