వృద్ధుల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి

by Sridhar Babu |
వృద్ధుల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి
X

దిశ, రవీంద్రభారతి : వృద్ధుల సంక్షేమ బాధ్యతను ప్ర‌భుత్వం చూస్తుందని పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది, మ‌హిళ, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క అన్నారు. వయోవృద్ధుల పోష‌ణ‌, సంర‌క్ష‌ణ చ‌ట్టాన్ని పకడ్బందీగా అమ‌లు చేయ‌డంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్ప‌గించే చ‌ర్య‌లు చేప‌డతామ‌న్నారు. వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచాల‌ని డిమాండ్ చేశారు. అంత‌ర్జాతీయ వ‌యోవృద్దుల దినోత్స‌వం సంద‌ర్భంగా ర‌వీంద్ర భార‌తిలో మంగ‌ళవారం ప్ర‌భుత్వం వేడుక‌లు నిర్వ‌హించింది. ఈ వేడుక‌లకు ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి సీత‌క్క వ‌యోవృద్దుల ఫిర్యాదు న‌మోదు కోసం రూపొందించిన యాప్ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఇక నుంచి ఆర్డీఓ, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల‌కు వెళ్లకుండానే మీ సేవా కేంద్రాల్లోనే వ‌యోవృద్దులు ఫిర్యాదు చేసుకునే విధానాన్ని మంత్రి సీత‌క్క ప్రారంభించారు. వ‌యోవృద్ధుల కోసం ఆన్ లైన్ ఫిర్యాదు విధానాన్ని ప్ర‌వేశ పెట్టిన మొట్ట‌మొద‌టి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పెద్దల కష్టాలు కన్నీళ్లు పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితి వయోవృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. సొంత కూతుర్లలాగా వయోవృద్ధులను చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ సేవా కేంద్రాల ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చని కోరారు. ఉచిత టోల్ ఫ్రీ నెం. 14567 సేవ‌ల‌ను మ‌రింత పటిష్ట పరుస్తామ‌న్నారు. పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందే హక్కు వృద్ధులకు ఉంద‌న్నారు.

వృద్ధులకు బస్సుల్లో ప్రయాణ రాయితీలు క‌ల్పించే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. తాను ఒక ఉద్యమకారుడి తల్లిని చూసేందుకు వ‌రంగ‌ల్ లో వృద్ధాశ్రమానికి వెళ్లేదానినని, అక్కడ వృద్ధుల ఆవేద‌న చూసి గుండె త‌రుక్కుపోయేద‌ని తెలిపారు. వృద్ధులకు కేంద్ర ప్ర‌భుత్వం కేవలం రూ. 200 నెల‌వారి పెన్షన్ ఇస్తుందని, ధరలు పెరిగినా గత పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి పెంచలేదని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా పలువురు వయోవృద్ధులను సన్మానించారు.

వృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రి ఘనంగా సన్మానించారు. రెండు నెలల్లో 200 మంది వయోవృద్ధుల కేసులను పరిష్కరించిన అనుదీప్ దురిశెట్టిని అభినందించారు. వేడుక‌ల్లో మ‌హిళ, శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి వాకాటి క‌రుణ‌, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ల సాధికారిత శాఖ డైరెక్టర్ శైలజ, భారీ సంఖ్య‌లో వృద్దులు పాల్గొన్నారు. వ‌యోవృద్ధుల ఆట‌లు, పాట‌లు, నృత్యాలతో వేడుక‌లు మారుమోగాయి.

Next Story