తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైనే జీహెచ్ఎంసీ ఆశలు

by Mahesh |
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైనే జీహెచ్ఎంసీ ఆశలు
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఇప్పటి వరకు ఎస్ఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ ప్రాజెక్టులతో పాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన సీఆర్ఎంపీ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు బల్దియా రూ.6,500 కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయం అప్పులు, మిత్తీలు చెల్లించేందుకు కూడా చాలకపోవడంతో అధికారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీకి రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జీహెచ్ఎంసీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని అధికారులే బాహాటంగా వ్యాఖ్యానించటం జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభ తీవ్రతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ ఆర్థిక స్తోమతకు మించి అప్పులు చేయటంతో కొత్తగా ఎక్కడా అప్పులు కూడా పుట్టకపోవటంతో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడింది. అప్పుల అసలు, మిత్తీలకు సంబంధించి నెలకు రూ.వంద కోట్లను చెల్లింస్తుండటంతో జీహెచ్ఎంసీ ఖజానా ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. దీంతో రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనంగా మారింది.

రెండు ప్రాజెక్టుల పనులకు బ్రేక్..

పంజాగుట్ట, అమీర్‌పేట మార్కెట్ల ఆధునీకరణకు టెండర్ల ప్రక్రియలు చేపట్టినా నిధులు లేకపోవటం, బిల్లుల చెల్లింపుల కష్టతరంగా మారుతాయన్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన జీహెచ్ఎంసీ అధికారులు రెండు ప్రాజెక్టు పనులను నిలిపివేశారు. వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా పనులను పక్కన పెట్టినట్లు సమాచారం. పంజాగుట్ట, అమీర్‌పేటట్‌లోని జీహెచ్ఎంసీ మార్కెట్ల ఆధునీకరణ పనులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని, నిర్మాణ సంస్థను సైతం టెండర్ల ద్వారా ఖరారు చేసుకుని, నిధుల లేమితో వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆపేసినట్లు సమాచారం. రూ.4 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సర్కారుకు ప్రతిపాదనలు పంపక ముందే కొత్త సర్కారు జీహెచ్ఎంసీకి రూ.1,100 కోట్లను విడుదల చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటన వచ్చింది. తాజాగా జీహెచ్ఎంసీ పంపిన రూ.5 వేల కోట్ల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని సర్కారు ముందుగా ఇస్తామన్న రూ.1,100 కోట్లను సవరించి, ఇంకా ఏమైనా ఎక్కువ నిధులు కేటాయిస్తుందా వేచి చూడాలి. సర్కారు బడ్జెట్‌లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు కేటాయించే నిధుల్లో రూ.2 వేల కోట్ల వరకు వివిధ ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీకి కేటాయించే అవకాశాలున్నట్లు అధికార వర్గాల సమాచారం.

స్టాంప్స్, రిజిస్ట్రేషన్ బకాయిలపై నో క్లారిటీ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన యజమాని పేరు మార్పు (మ్యుటేషన్)కు సంబంధించి జీహెచ్ఎంసీకి 2014 నుంచి నుంచి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఎంత బకాయి ఉందన్న విషయంపై అటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద గానీ, ఇటు జీహెచ్ఎంసీ వద్ద కానీ క్లారిటీ లేదు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం సుమారు రూ.2,980 కోట్ల వరకు జీహెచ్ఎంసీకి పదేళ్ల మ్యుటేషన్ నిధులు రావల్సి ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు కూడా సర్కారు పదేళ్ల నుంచి చెల్లించడం లేదని తెలిసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.151.8 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పడినట్లు సమాచారం. ఈ రకంగా పదేళ్ల నుంచి రూ.రెండున్నర వేల కోట్ల పైచిలుకు సర్కారు బకాయి పడినట్లు సమాచారం.



Next Story