బెంగాల్ దోషులకు మరణ శిక్ష వేయాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

by srinivas |
బెంగాల్ దోషులకు మరణ శిక్ష వేయాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బెంగాల్ ఘటనలో దోషులకు మరణ శిక్ష వేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ సంఘటనను కవర్ చేయడానికి ప్రయత్నిస్తే కోర్టు సీబీఐకి అప్పగించిందన్నారు. అక్కడి ప్రభుత్వం నిందితుల తప్పులను కప్పిపుచే ప్రయత్నం చేసిందని విమర్శలు చేశారు. ఆ యువతిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని బూర మండిపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి చెందిందని నర్సయ్య గౌడ్ చెప్పారు.

టీఎంసీ గుండాలు హాస్పిటల్‌పై దాడి చేసి సాక్ష్యాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారన్నారు. దీదీ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బెంగాల్ లో అరాచకం సాగుతోందని నర్సయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె చర్యల వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడే అవకాశముందన్నారు. ఉగ్రవాద సంస్థలు ఆమె భద్రతలో తల దాచుకున్నట్లుగా బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మమతపై చర్యలు తీసుకోవాలని బూర డిమాండ్ చేశారు. హాస్పిటళ్లపై దాడులు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని, ఇలాంటివి జరగొద్దంటే ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హాస్పిటళ్లలో పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వెస్ట్ బెంగాల్‌లో సంఘటన జరిగింది కాబట్టి ఇండి అలయన్స్ నోరు మెదపడం లేదని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.

Next Story