మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహచరుడిగా పని చేశా: కేసీఆర్

by srinivas |   ( Updated:2024-12-27 02:37:35.0  )
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహచరుడిగా పని చేశా: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరత మాత ముద్దు బిడ్డగా కొనియాడారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని., డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. మిత భాషిగా, అత్యంత సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత వేరువేరు ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి సేవలను కొనియాడారు.

Advertisement

Next Story