బల్దియాలో బదిలీల పంచాయితీ.. కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయంపై ఉత్కంఠ?

by srinivas |
బల్దియాలో బదిలీల పంచాయితీ.. కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయంపై ఉత్కంఠ?
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోకి ఒక్కసారి పోస్టింగ్‌పై వచ్చిన వారు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశాలు అమలు చేయటంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నచ్చిన పోస్టింగ్ ఇవ్వాలంటూ ఒక అడిషనల్ కమిషనర్ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీపడుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జాయింట్ డైరెక్టర్లు, అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో పాటు గ్రేడ్ 1,2,3 లకు చెందిన 24 మందికి స్థానచలనం కలిగిస్తూ ఆయన గత నెలాఖరులో ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీకి చెందిన 12 మందికి కూడా స్థానచలనం కలిగింది. వీరిలో ఇద్దరు మహిళా జాయింట్ కమిషనర్లు మెడికల్ నిబంధన పెట్టి, ట్రాన్స్‌ఫర్ అయిన చోట రిపోర్టు చేయకుండా జీహెచ్ఎంసీలోనే కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను ఉల్లంఘించి వారు ఇక్కడే కొనసాగేందుకు పలువురు ఉన్నతాధికారులు తమవంతు సహకారాన్ని అందిస్తుండటం గమనార్హం.

కొత్తగా వచ్చిన ఇద్దరు అదనపు కమిషనర్లలో ఒకరిని ఇప్పటికే శానిటేషన్ విభాగానికి కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. శానిటేషన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రవికిరణ్‌ను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ పోస్టుకే పరిమితం చేసి, శానిటేషన్ విభాగాన్ని ఇటీవలే జీహెచ్ఎంసీకి వచ్చిన అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్‌కు అప్పగించినట్లు సమాచారం. మరో అడిషనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్‌కు జోనల్ కమిషనర్ పోస్టు ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పగా, ఆయన తనకు అడిషనల్ కమిషనర్ పోస్టే కావాలని భీష్మించుకున్నట్లు సమాచారం. ఈ అడిషనల్ కమిషనర్‌తో పాటు ఇప్పటికే ఓ విభాగానికి అదనపు కమిషనర్‌గా కొనసాగుతున్న మరో అధికారి తనకు జోనల్ కమిషనర్ పోస్టే కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

పీఎస్ వచ్చిన తర్వాతే తేలనుందా?

ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా సియోల్‌లో ఉన్నారు. ఆయన రేపోమాపో సిటికీ వచ్చిన తర్వాతే జాయింట్ కమిషనర్ల పైరవీలు కొలిక్కి రానున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన వారిలో దాదాపు అందరూ అడిషనల్ కమిషనర్లకు దాన కిషోర్‌తో సత్సంబంధాలున్నట్లు సమాచారం. ఆయన వచ్చిన తర్వాత పోస్టింగ్‌లు, సీట్ల పంచాయితీని కమిషనర్ ఆమ్రపాలి ఆయన ముందు ఉంచనుందా? లేక ఆయన రాకముందు ఆమె పరిష్కరిస్తుందా? వేచిచూడాలి.

Advertisement

Next Story