- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో ఫైళ్ల నిర్వహణ అస్తవ్యస్తం
దిశ, సిటీబ్యూరో : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీఎస్ బీపాస్‌లో, కూల్ రూఫ్ వంటి వాటిల్లో దేశంలోనే జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే పాలకులు, అధికారులు ఫైల్ మేనేజ్‌మెంట్‌లో పూర్‌గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సర్కిళ్లలో పర్మినెంట్ ఉద్యోగులు సర్వీస్ రికార్డులు మాయం కావటంతో వందలాది మంది ఉద్యోగులకు పీఆర్సీ వంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఒరిజినల్ సర్వీస్ రికార్డు ఆఫీలో భద్రపరచడంలో ఇప్పటి వరకు సర్కిళ్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించగా, ఇప్పుడు అదేబాటలో ప్రధాన కార్యాలయం సిబ్బంది పయనిస్తున్నారన్న వాదనలున్నాయి. జీహెచ్ఎంసీని పేపర్ లెస్ ఆఫీసుగా మార్చేందుకు గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ఈ-ఆఫీస్‌ను ప్రవేశపెట్టిన అధికారులు అప్పటి వరకు కాగితాలుగా ఉన్న ఫైళ్లను డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించి, ఆ ప్రక్రియను కాస్త మధ్యలోనే ఆపేశారు.
ఇప్పుడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మొత్తం ఏడు అంతస్తులుండగా, మూడు అంతస్తుల్లో ఎక్కడబడితే అక్కడ ఫైళ్ల మూటలు దర్శనమిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది, సందర్శకులు రాకపోకలు సాగించే దారిలో ఈ మూటలను అడ్డంగా పారేశారు. కనీసం ఇలా పారేసిన మూటల్లోని ఫైళ్లన్నీ డిజిటలైజేషన్ అయ్యాయా? అన్న ప్రశ్నకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. వీటిలో చాలా వరకు ఉద్యోగుల జీతభత్యాలు, కార్పొరేషన్ వ్యయం, హెల్త్, శానిటేషన్ బిల్లులతో పాటు ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, లీగల్ సెక్షన్లకు సంబంధించిన ఫైళ్లను నిర్లక్ష్యంగా మూటలు గట్టి పారవేశారు.
సర్కిళ్లలో మరీ అధ్వాన్నం..
ఏడు సర్కిళ్ల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లోకి శివారులోని 12 మున్సిపాల్టీలను విలీనం చేస్తూ, 2007లో అప్పటి ప్రభుత్వం గ్రేటర్‌గా ప్రకటించింది. కానీ విలీనమైన సర్కిళ్లలో 2007కు ముందు జరిగిన ట్యాక్స్, భవన నిర్మాణ అనుమతులు, ఇంజినీరింగ్ మెయింటనెన్స్ పనులు, పలు ముఖ్యమైన ఖర్చులకు సంబంధించిన ఏఒక్క ఫైల్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఓ భవనం నిర్మాణ అనుమతికి సంబంధించి ప్రస్తుతం సర్కిల్ ఆఫీసుల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు గానీ, వాటికి సంబంధించిన పత్రాలు గానీ అందుబాటులో లేకపోయినా, సదరు భవనం అక్రమ నిర్మాణమంటూ ఏకంగా 200 శాతం ఆస్తి పన్ను విధించిన సందర్భాలున్నాయి. ఇంటి యజమాని వద్దనున్న అనుమతి పత్రాన్ని చూపితే దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమ కార్యాలయంలో లభ్యం కావటం లేదంటూ, అది నకిలీ అనుమతి పత్రమంటూ దబాయిస్తూ, సర్కిల్ సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటూ యజమానులపై పన్ను మోత మోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆస్తుల పత్రాలేమైనట్టు?
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్‌గా రూపాంతరం చెందిన మొదటి ఆర్థిక సంవత్సరంలోనే జీహెచ్ఎంసీ ఆస్తులను విలువేయించగా సుమారు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల మధ్య ఉన్నట్లు అంచనాలు వేశారు. కానీ ఆ తర్వాత పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యం కాకపోవటంతో కౌన్సిల్ సమావేశంలో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. జీహెచ్ఎంసీ చెందిన ఓ ఆస్తికి సంబంధించిన పత్రాలు స్థానిక సర్కిల్ ఆఫీసులో ఉన్నాయా? ప్రధాన కార్యాలయంలోని ఎస్టేట్ ఆఫీసులో ఉన్నాయా? అన్నది నేటికీ ఉన్నతాధికారులకు, విభాగాధిపతులకు కూడా క్లారిటీ లేకపోవటం ఫైళ్ల నిర్వహణకు నిదర్శనం. కొద్ది సంవత్సరాల క్రితం పత్రాల్లేని ఆస్తులకు సంబంధించిన టౌన్ సర్వే ల్యాండ్ రికార్డు విభాగంతో సెకండ్ కాపీ డాక్యుమెంట్లను రూపొందించినా, ప్రస్తుతం అవి కూడా అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. ఎస్టేట్ సిబ్బంది చేతివాటంతోనే ఈ డాక్యుమెంట్లు గల్లంతవుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.