Corporate Hospitals: ప్రైవేటు వైద్యమే దిక్కు..? నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల హవా

by Shiva |
Corporate Hospitals: ప్రైవేటు వైద్యమే దిక్కు..? నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల హవా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య సేవలు అరకొరగానే ఉన్నాయి. నిత్యం కాలుష్యం, కలుషిత ఆహారం తీసుకుంటున్న నగర ప్రజలు ఎప్పుడు ఎలా అనారోగ్యానికి గురౌతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. సుమారు కోఠికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ పరిధిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, పేట్లబుర్జు, సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, బస్తీ దవాఖానలు ఉన్నప్పటికీ వాటిల్లో ఉండే రద్దీ, అరకొర వసతులు, పడకల లేమి, వైద్యులు, సిబ్బంది కొరత తదితర కారణాలతో ఒక్కోసారి అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందడం లేదనే అపవాదు సైతం ఉంది. దీంతో పేద రోగులు మృత్యవాతపడుతున్నారు.

భాగ్యనగరంలో వేల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, డయోగ్నోస్టిట్ సెంటర్‌లు, నర్సింగ్ హోంలు ఉంటే నిత్యం వేలాది మంది వైద్యం పొందే ప్రభుత్వ దవాఖానాలు పదుల సంఖ్యలో ఉండడం పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాలలో లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొందే ఆర్ధికస్థోమత లేనివారు వైద్యం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ప్రాణం మీద ఆశ‌తో ప్రైవేట్ ఆస్పత్రులలో చేరి ఆస్తులన్ని అమ్ముకుంటున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. చివరకు రోగులు చనిపోవడంతో బందువులు ఆందోళనలకు దిగిన సందర్భాలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ధనార్జనే ధ్యేయంగా రోగులను పీడిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రైవేట్‌లో రెండు వేలకు పైగా..?

అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, డయోగ్నోస్టిట్ సెంటర్‌లు, నర్సింగ్ హోంలు ఉన్నాయంటే పరిస్థితి ఇట్టే అర్థం అవుతోంది. ప్రైవేట్ సెక్టార్‌లో ఇంత భారీ సంఖ్యలో హాస్పిటల్స్, క్లీనిక్స్ వంటివి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రులు అరకొరగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కొన్ని సందర్భాలలో వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి రోగులు పడరానిపాట్లు పడుతున్నారు. దీనికితోడు ఉస్మానియా, గాంధీ వంటి పెద్దాస్పత్రులలో రోగుల రద్దీకి తగ్గట్లుగా బెడ్స్ లేకపోవడం, వాటిల్లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి రోగులకు సేవలందించడం సవాల్‌గా మారుతోంది. ఇక చెవి, ముక్కు, గొంతు, కంటి జబ్బులకు ప్రైవేట్‌లో వందల సంఖ్యలో హాస్పిటల్స్, క్లీనిక్స్ ఉండగా ప్రభుత్వ పరంగా కోఠి ఈఎన్టీ, ఉస్మానియా డెంటల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు లేనివి 276..

హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 276 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్‌లు, డయోగ్నోస్టిట్ సెంటర్‌లు, నర్సింగ్ హోంలు ఉన్నాయి. అధికారుల ఉదాసీనత, చూసీచూడనట్లు పోయే వ్యవహారం కారణంగా ఇంత పెద్ద మొత్తంలో అనుమతులు లేని దవాఖానాలు నడుస్తున్నాయి. వీటిల్లో అనుభవం లేని వైద్యులు చికిత్స అందిస్తుండడంతో కొన్ని సందర్బాలలో రోగులు మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోవడం ప్రభుత్వ వైద్యం ఎలా ఉందనేది స్పష్టం చేస్తుంది.

50 ప్రభుత్వ, 330 ప్రైవేట్ ఆస్పత్రులు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రభుత్వ అనుమ‌తి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్ని ఉన్నాయ‌ని యూత్‌ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్ సంస్థ తెలంగాణ వైద్యశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ప్రశ్నించ‌గా హైద‌రాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి అందుకు సంబంధించిన స‌మాచారం ఇచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రభుత్వ అనుమ‌తి తీసుకున్న ప్రైవేట్ కార్పోరేట్, ఆస్పత్రులు 330 ఉండగా ప్రభుత్వ ఆస్పత్రులు కేవలం 50 మాత్రమే ఉన్నాయని ఆర్టీఐ కింద అధికారులు సమాధానం ఇచ్చారని యూత్‌ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్‌ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

ఇతర జిల్లాలలోనూ అంతంత మాత్రమే..

తెలంగాణలోని పలు జిల్లాల వైద్యాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రభుత్వ అనుమ‌తి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 105, అందులో శ‌స్త్ర చికిత్సలకు అనుమ‌తి ఉన్నవి 65. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 190, వీటిల్లో శ‌స్త్రచికిత్సలకు అనుమ‌తి ఉన్నవి 46. పెద్దప‌ల్లిలో ప్రభుత్వ అనుమ‌తి ఉన్న ఆస్పత్రులు 115, ఇందులో శ‌స్త్రచికిత్సలకు అనుమ‌తి ఉన్నవి 36. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 153. జ‌గిత్యాల‌లో 240. సిద్దిపేట జిల్లాలో 137 అనుమ‌తి ఉన్న ఆస్పత్రులు ఉండగా వీటిల్లో శస్త్ర చికిత్సలు అనుమ‌తి ఉన్న ఆస్పత్రులు 70. సూర్యాపేట జిల్లాలో 61. వికారాబాద్ జిల్లాలో 79 ఆస్పత్రులకు ప్రభుత్వ అనుమతి ఉండగా శ‌స్త్ర చికిత్సలకు అనుమ‌తి ఉన్న దవాఖానలు 39. ఖ‌మ్మం జిల్లాలో ప్రభుత్వ అనుమ‌తి ఉన్నప్రైవేట్ ఆస్పత్రులు 243, శస్త్ర చికిత్సలకు అనుమతి ఉన్నవి 85. జోగులాంబ గద్వాల జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 41, శస్త్ర చికిత్సలకు అనుమతులు ఉన్నవి 26. ఆసిఫాబాద్ జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ 50. భూపాల‌పల్లి జిల్లాలో అనుమ‌తి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 32గా ఉన్నాయి.

Advertisement

Next Story