ఉస్మానియాలో మృతునికి కరోనా పాజిటివ్

by Sridhar Babu |
ఉస్మానియాలో మృతునికి కరోనా పాజిటివ్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా అలజడి సృష్టిస్తోంది. కొన్ని నెలల పాటు కోవిడ్ కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నగర ప్రజలు రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో ఆందోళనలకు గురౌతున్నారు . గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులలో సింహభాగం జీహెచ్ఎంసీ పరిధే కావడం విచారకరం.

ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిధిలో జనాలు అధికంగా ఉండడం, కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయనే వాదనలు వినబడుతున్నాయి . ఓ వైపు చలికాలంలో సీజనల్ వ్యాధులు ఉధృతమౌతుండగా కరోనా కల్లోలం మళ్లీ మొదలు కావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 కేసులు నమోదు కాగా వాటిలో 45 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుండే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఉస్మానియాలో రోగి మరణం...

బండ్లగూడకు చెందిన సుభాన్ (60) ఈ నెల 14వ తేదీన గుండె , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 24వ తేదీన మృతి చెందాడు. అనంతరం మృతదేహానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే వరుస సెలవుల కారణంగా అతని మృతి వెలుగు చూడలేదు.

మంగళవారం బయటపడడంతో అతడు చికిత్స పొందిన వార్డుతో పాటు వైద్య సేవలు అందించిన వారిలో ఆందోళన మొదలైంది. హాస్పిటల్ లో కోవిడ్ కారణంగా రోగి చనిపోయాడనే వదంతులు ప్రచారం కావడంతో ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మృతుడు కోవిడ్ తో కాకుండా గుండె పోటుతో మరణించాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరణ ఇవ్వడంతో రోగులలో కొంత ఆందోళన తగ్గింది. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆస్పత్రిలో మరో ముగ్గురు రోగులు కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

లెక్కకు రాని కేసులు....

తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసులు, అధికారికంగా ప్రకటిస్తున్న కేసులలో వ్యత్యాసం కనబడుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రులలో నమోదైన కేసులనే అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారనేది అధికారులు రోజు వారీగా ప్రకటిస్తున్న కేసులను బట్టి అర్ధం అవుతోంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు ప్రకటించిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. వీటిల్లో ఐదు కేసులు హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నట్లు చూపారు. ఇంతవరకు బాగానే ఉనప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా ఇందుకు

సంబంధించిన వివరాలు బులిటెన్ లో చూపకపోవడం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన గణాంకాలలో వాటిని పరిగణలోకి తీసుకోలేదని తేలిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే . జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో కోవిడ్ లక్షణాలతో వస్తుండగా వాటిలో కూడా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలలోకి రాకపోవడం, కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల లెక్కలను అధికారులు ప్రకటిస్తుండడంతో వాస్తవ పరిస్థితులు బహిర్గతం కావడం లేదు. మొత్తం మీద జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ కోవిడ్ కేసులు పెరుగుతున్నా 90 శాతం మంది నిబంధనలు పాటించడం లేదు.

జాగ్రత్తలు పాటించకపోతే ....

దేశంలో, రాష్ట్రంలో క్రమ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతినిత్యం కేసుల సంఖ్య పెరుతూ వస్తున్నాయి. మరో నాలుగు రోజులలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీనికి తోడు అయ్యప్ప మాలధారణతో కేరళ లోని శబరిమళై కు వెళ్లి వచ్చే అయ్యప్ప భక్తుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. ప్రస్తుతం కేరళలో కోవిడ్ కేసులు అధికంగా

నమోదవుతున్నాయి. మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి వచ్చే అయ్యప్ప భక్తుల ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదు. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించడం గమనార్హం.

హైదరాబాద్ జిల్లాలో ఏ రోజు ఎన్ని కేసులు

తేదీ నమోదైన కేసులు

19 04

20 06

21 04

22 08

23 09

24 05

25 09

Advertisement

Next Story

Most Viewed