భార్యపై క్షుద్రపూజలు చేయిస్తున్నాడని సడ్డకుడి హత్యకు కుట్ర

by Sridhar Babu |
భార్యపై క్షుద్రపూజలు చేయిస్తున్నాడని సడ్డకుడి హత్యకు కుట్ర
X

దిశ, చార్మినార్​ : సడ్డుకుడి హత్యకు స్నేహితులతో కలిసి పన్నిన కుట్రను ఫలక్​నుమా పోలీసులు భగ్నం చేశారు. తనభార్యపై క్షుద్ర పూజలు చేయడం కారణంగానే తనకు పిల్లలు పుట్టకపోవడంతో పాటు తరచూ భార్య గొడవపడుతుందన్న అనుమానంతో సడ్డకుడిని స్నేహితులతో కలిసి హత్యకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు విఫలం చేశారు. హత్యకు కుట్రపన్నిన ఏడుగురిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో మైనర్​ బాలుడిని జైవైనల్​ హోంకు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి వద్ద నుంచి ముగు కొడవళ్లు, మూడు కత్తులు, రెండు బైక్స్​ తో పాటు సెల్​ఫోన్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫలక్​నుమా ఏసీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఫలక్​నుమా ఏసీపీ షేక్​ జహంగీర్​, ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్రతో కలిసి సౌత్​ జోన్​ డీసీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్​ ఫారూఖ్​నగర్​కు చెందిన మీర్​ అష్ఫాక్​​ అలీ అలియాస్​ అమీర్​ ఖాన్​ (27) లాడ్​బజార్​లో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అష్ఫాక్​ ​ అలీ భార్య, నజీమ్​ అలియాస్​ ఇషాన్​ భార్య సొంతం అక్కాచెల్లెళ్లు. గత కొంత కాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రోజుల క్రితం అషఫ్​ అలీఖాన్​ తన సడ్డకుడు నజీమ్​పై చెయ్యి చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి అష్ఫాక్​ అలీ కుటుంబం మీద నజీమ్​ దుష్ప్రచారం చేస్తున్నాడని అతనిపైన కక్ష పెంచుకున్నాడు. అంతేగాకుండా అష్ఫాక్​ భార్యపై నజీమ్​ క్షుద్ర పూజలు చేయిస్తుండటంతో తన భార్యకు పిల్లలు పుట్టడం లేదని, ప్రతి రోజూ తనతో ఆమె గొడవకు దిగుతుందనే అనుమానంతో నజీమ్​ ను ఎలాగైనా హత్య చేయాలని తన స్నేహితులైన మొహమ్మద్​ సుభాన్​ ఖాన్​ (19), మొహమ్మద్​ జమీల్​ ఖాన్​ (19), ఫర్హాన్​, ఇమ్రాన్​, చోటా ఫర్హాన్​ తో పాటు మరో మైనర్​ బాలుడితో కలిసి కుట్ర పన్నాడు. ఈ నేపధ్యంలోనే నాందేడ్​ తో పాటు ఇతర ప్రాంతాలలో కొనుగోలు చేసిన కొడవళ్లు, కత్తులను రెడీ చేసుకుని నజీమ్​ను హత్య చేయడానికి అదునుకోసం వేచి చూస్తున్నారు.

ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5.30 ఫారూక్​నగర్​లోని జైతూన్​ హోటల్​ లో నజీమ్​ను హత్య చేయడానికి మారణాయుధాలతో అష్ఫక్​ అలీ తన స్నేహితులైన మొహమ్మద్​ సుభాన్​ ఖాన్, మొహమ్మద్​ జమీల్​ ఖాన్ లతో పాటు మరో మైనర్​ బాలుడు మాటు వేసి ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర బృందం జైతున్​ హోటల్​కు మఫ్టీలో చేరుకుని హత్య కుట్రను భగ్నం చేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ హత్య కుట్రలో మరో ముగ్గురు స్నేహితులు ఫర్హాన్​, ఇమ్రాన్​, చోటా ఫర్హాన్​ల పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అష్ఫక్​ అలీ, మొహమ్మద్​ సుభాన్​ ఖాన్, మొహమ్మద్​ జమీల్​ ఖాన్ తో పాటు మరో మైనర్​ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని పోలీసులు రిమాండ్​కు తరలించగా, మరో మైనర్​ బాలుడిని జువైనల్​ హోంకు తరలించారు. పరారీలో ఉన్న ఫర్హాన్​, ఇమ్రాన్​, చోటా ఫర్హాన్​ లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. హత్య కుట్ర కేసును భగ్నం చేసిన ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర, ఎస్​ఐలు నాగరాజ్​, రవికుమార్​, కానిస్టేబుళ్లు రియాజ్​, వినయ్​లకు సౌత్​జోన్​ డీసీపీ సాయిచైతన్య రివార్డులను అందజేశారు. ఈ కేసును ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed