మట్టి విగ్రహాలను పూజించాలి : మంత్రి పొన్నం

by Sridhar Babu |
మట్టి విగ్రహాలను పూజించాలి : మంత్రి పొన్నం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు, ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రింకోర్టు తీర్పు చట్టాన్ని గౌరవిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నట్లు అవుతుందని తెలిపారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనక విగ్రహాలతో వాతావరణ కాలుష్యంతో చిన్న వయసులోనే క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తున్నందున ప్రజలు ఇప్పటినుండి మార్పులు చేపట్టి భవిష్యత్ తరానికి మంచి వాతావరణం అందించాలని కోరారు. గణేష్ విగ్రహాల తయారీలో కొంత సాంకేతికత ఉపయోగించి ఎత్తైన విగ్రహాలు కూడా తయారు చేస్తే అందరూ మట్టి విగ్రహాల వైపు మరలుతారని అన్నారు. నెల రోజుల ముందే మట్టి వినాయకులు ఆర్డర్ ఇచ్చేలా చూసుకోవాలన్నారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయని, కుల వృత్తులు ఉత్పత్తి చేసే వాటిని ప్రోత్సహించాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో కూడా సింథటిక్ శాలువాలకు బదులుగా కాటన్ శాలువాలు వాడితే చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుందన్నారు. పూజలకు అవసరమైన వస్త్రాలను చేనేత రంగానికి సంబంధించినవి మాత్రమే వాడాలని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించుటకు స్ఫూర్తిదాయకంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. శీతల పానియాలకు బదులుగా నేచురల్ ఫుడ్, సహజ ఆహారమైన రాగులు, సజ్జల వైపు దృష్టి సారించి మార్గదర్శకులుగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరివన్, పీఈ వెంకట చారి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఆశన్న, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి. సురేష్ బాబు, జిల్లా అధికారులు పెరికే యాదయ్య, జయ శంకర్, ఆర్. కోటజీ, సీపీవో డాక్టర్ సురేందర్, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story