అనుమతిలేకుండా యాడ్స్ ప్రదర్శన.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు

by srinivas |
అనుమతిలేకుండా యాడ్స్ ప్రదర్శన.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు
X
  • ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోంది
  • కర్నాటక ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇవ్వడం కోడ్ ఉల్లంఘనే
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పేపర్లలో కర్నాటక పథకాలను ప్రకటనలు ఇవ్వడం కోడ్ అతిక్రమించడమేనని, చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లీగల్ సెల్, పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలపై రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేసినట్లు లీగల్ సెల్ బృందం పేర్కొంది.

బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. మొత్తం ఆరు అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే సర్కార్ సొమ్ముతో తెలంగాణలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు, ఆంగ్ల పేపర్‌లో యాడ్స్ ఇచ్చిందని తెలిపారు. ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగం చేయడమేనన్నారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీసీఎం డికే శివకుమార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారని, ఉచితపథకాలతో ఆరాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని, తెలంగాణలోనూ ఉచిత పథకాలను ప్రకటించిందని తెలిపారు. ఈ పథకాలను వివరిస్తూ ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమేనన్నారు. భారత ఎన్నికల సంఘం ఆమోదించిన నిబంధనలు ఉల్లంఘించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం ఆమోదం లేకుండా యూఎఫ్ఓ మూవీజ్ ఇండియా లిమిటెడ్, క్యూబ్ సినిమా సంస్థల పేరుతో సినిమా ధియేటర్లలోనూ ప్రదర్శిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అమలు చేసిన పథకాలను ప్రచారం చేయొద్దని చెప్పినప్పటికీ చేస్తోంది దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసారం చేసిన సినిమా థియేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకటనలు నిలిపివేయడంతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ పై విమర్శలు చేసిన మైనంపల్లి హన్మంతరావుపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులైన 32 మందిని కొనుగోలు చేశారని, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు వేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడే భాషపై మరోసారి ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై 11 వీడియోలు సీఈ కు ఇచ్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలోనే ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ రేపు ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేరుస్తామని అఫిడేవిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇంటర్వ్యూల గురించి ముందస్తు అనుమతి తీసుకున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి వెళ్తామన్నారు.

Advertisement

Next Story