ఎంఐఎం ఆఫీస్ చుట్టూ బీఆర్‌ఎస్ నేతలు!

by Anjali |   ( Updated:2023-08-23 02:48:01.0  )
ఎంఐఎం ఆఫీస్ చుట్టూ బీఆర్‌ఎస్ నేతలు!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : బీఆర్ఎస్ టిక్కెట్ కోసం గోషామహల్ నియోజకవర్గం నేతలలో టెన్షన్ మొదలైంది. ఎలాగైనా పార్టీ టిక్కెట్ దక్కించుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో గోషామహల్ అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం ప్రకటన చేయడంతో స్థానిక నాయకులు పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిసింది. మంగళవారం నియోజకవర్గం పార్టీ నాయకులు ఎవరికి వారే వేర్వేరుగా మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితర పార్టీ నాయకులను కలిసి గోషామహల్ టిక్కెట్ తమకే ఇప్పించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. పార్టీకి తాము చేస్తున్న సేవలను వివరించి టిక్కెట్ అభ్యర్థిస్తున్నారు.

ఎంఐఎం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు..

బీఆర్ఎస్ గోషామహల్ టిక్కెట్ రాజకీయం ఎంఐఎం కార్యాలయానికి చేరింది. ఇదేంది బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఎంఐఎం కార్యాలయానికి వెళ్ళడమేమిటని అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ఇదే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో గోషామహల్ నాయకులు ఓ వైపు బీఆర్ఎస్ అగ్రనేతలను కలుస్తూనే ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీని కలిశారని సమాచారం. ఎలాగైనా సీఎం కేసీఆర్‌కు తమకు టిక్కెట్ వచ్చేలా సిఫారసు చేయమని ప్రాధేయపడ్డట్లు తెలిసింది. ఇది నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్ కోసం నాయకులు పడుతున్న తంటాలు చూసి ఇతర నాయకులు, ప్రజలు వారిని ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరోమారు సమావేశమైన అసమ్మతి వర్గం..

గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన వాయిదా పడడంతో స్థానిక నేతలలో టెన్షన్ మొదలైంది. పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి నందకిషోర్ వ్యాస్ (బిలాల్)ను వ్యతిరేకిస్తున్న నాయకులు గతంలో కూడా సమావేశమై తమలో ఎవరికైనా టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఇది అప్పట్లో స్థానికంగా చర్చనీయాంశమైంది. పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో నందకిషోర్ వ్యాస్‌ను వ్యతిరేకిస్తున్న నాయకులు సోమవారం రాత్రి ఓ మహిళా నాయకురాలి ఇంట్లో సమావేశమయ్యారు. సుమారు పది మందికి పైగా నాయకులు ఈ సమావేశంలో పాల్గొని తమలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెల్పించుకుంటామని, ఇదే విషయాన్ని మంత్రి తలసాని వద్ద కూడా చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన నిలిచిపోవడం, టిక్కెట్ కోసం నాయకులు పడుతున్న అవస్థలను ఇతర పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

టిక్కెట్ రేసులో కట్టెల..?

బీఆర్ఎస్ గోషామహల్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకునే వారిలో ఆయన పేరు కూడా వినబడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కట్టెల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. ఇక్కడ బీసీలు, ప్రత్యేకించి యాదవ్ కమ్యునిటీ ఓట్లు కూడా అధికంగానే ఉండడంతో గెలుపు సులువు అవుతందని, తొలిసారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసే అవకాశం ఉంటుందని, ఒక్క అవకాశం ఇవ్వాలని కట్టెల సీఎం కేసీఆర్‌ను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed