బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు నిరసన వెల్లువ

by Sridhar Babu |   ( Updated:2023-10-27 08:44:30.0  )
బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు నిరసన వెల్లువ
X

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ కు నియోజకవర్గంలో అడుగడుగున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న పార్షిగుట్టలో ఓ మహిళ తమ బస్తీకి పద్మారావు ప్రచారానికి రావద్దని, డప్పు కొట్టి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇలాంటి చేదు అనుభవమే మానికేశ్వరి నగర్ లో పద్మారావు గౌడ్ కు ఎదురైంది. మనికేశ్వరి నగర్ ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించలేదని బస్తీవాసులు ఆయనను అడ్డుకొని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఓడించి తీరుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించే వరకు పద్మారావు బస్తీలోకి అడుగు పెట్టకూడదని వారు మండిపడ్డారు. వి వాంట్ హాస్పిటల్, పద్మారావు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక డివిజన్ పరిధిలోని మాణికేశ్వరి నగర్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి పద్మారావు గౌడ్ ప్రచారం ప్రారంభించారు. బస్తీ కమాన్ వద్దనే బస్తీవాసులు ఆయనను అడ్డుకొని నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు బస్తీవాసులు మాట్లాడుతూ..ఆసుపత్రి నిర్మాణం కోసం126 రోజులు దీక్షలు చేపట్టినా ఏ ఒక్కరోజు కూడా పద్మారావు వచ్చింది లేదన్నారు. ఎన్ని సార్లు పోయి మొర పెట్టుకున్నా పద్మారావు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య కేటీఆర్ దృష్టికి వెళ్లాక, ఆసుపత్రి నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కరించక పోయేసరికి తాము మళ్లీ వెళ్లి

పద్మారావును కలిస్తే వెతకారంగా సమాధానం ఇచ్చారని, తమ పీఏ ను పిలిచి వీళ్లకు ఆసుపత్రి పర్మిషన్ కావాలంటే నీ జేబులో ఉంటే తీసి ఇవ్వు అని హేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. మీ బస్తీ వాళ్ల ఓట్లు ఎంత నాకు, మీరు వేయకపోయినా సరే ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే గెలుస్తా అని మాట్లాడాడని చెప్పారు. ఆసుపత్రి సమస్య ఇంతవరకు అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలి పోయిందన్నారు. బస్తీ ఓట్లు అవసరం లేదన్న పద్మారావు మళ్లీ ఎన్నికలు రాగానే బస్తీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పద్మారావు ను ఓడించి తీరుతామని హెచ్చరించారు. అవసరమైతే డప్పు కొట్టి చెప్తామని తెలిపారు. నిరసన తెలిపిన వారిలో ఏముల శ్రీనివాస్ , గంటికోట నర్సింహ, ఆలకుంట నర్సింహ , బొదాసు నర్సింహ, ఓ.శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.

గెలిపిస్తే ఆసుపత్రి నిర్మిస్తా...

బస్తీలో స్థలం లేని కారణంగా ఆసుపత్రి నిర్మాణం జరగలేదని పద్మారావు గౌడ్ అన్నారు. ఉన్న స్థలం ఉస్మానియా యూనివర్సిటీది కావడంతో ఆస్పత్రి నిర్మాణం విషయంలో జాప్యం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి ఆస్పత్రి నిర్మాణం జరిపిస్తానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed