ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలను బీజేపీ అణచివేస్తుంది : ఎంపీ ఈటల

by Aamani |
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలను బీజేపీ అణచివేస్తుంది : ఎంపీ ఈటల
X

దిశ, చైతన్య పురి : ముఖ్యమంత్రి అహంకారపూరిత నిర్ణయాలు, మాటలను భారతీయ జనతా పార్టీ నిలువరిస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం చైతన్యపురి డివిజన్ లోని వినాయక నగర్ న్యూ మారుతి నగర్ ఫణిగిరి కాలనీలలో మూసి నివాసితులతో సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళన పేరిట మూసీ కి ఇరువైపులా ఆర్ బి ఎక్స్ అని రాయడం ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమని అన్నారు. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరుందని విమర్శించారు. ఇటీవల డీపీఆర్ రిపోర్టు పేరిట రూ. 141 కోట్లు కేటాయిస్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరిపోర్ట్ రావడానికి 18 నెలలు పడుతుందని చెప్పి మాట మార్చి మూసీ నివాసితులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన గత 3 నెలలుగా మూసీనదికి ఇరువైపుల ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం, ఆదివారం వచ్చిందంటే ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని తెలిపారు. అప్పోసప్పో చేసి ప్రజలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి ఒక్కటి చెప్పదలుచుకున్న మీ మంత్రులను సియోల్, న్యూయార్క్ కి కాదు పంపాల్సింది. వారిని పంపాల్సింది మూసీనదికి ఇరువైపులా ఉన్న ప్రజలను కలవడానికి పంపాలని డిమాండ్ చేశారు. నీవు ఏమి చేయాలనుకున్నావో ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నావో ఇండ్లు పోతాయా లేదా అనేది వివరించి ప్రజలకు ప్రశాంతత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల కోసం బీజెపి ఆధ్వర్యంలో ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ యంత్రాంగం అంతా కలిసి మూసినది నివాసితులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మీ నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈయన వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు రంగ నరసింహ గుప్తా, నాయకోటి పవన్ కుమార్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed