కమిషన్ ముందు విచారణకు హాజరుకాని ఎస్ఎఫ్ఏ ఉద్యోగి

by Mahesh |   ( Updated:2024-08-04 03:25:45.0  )
కమిషన్ ముందు విచారణకు హాజరుకాని ఎస్ఎఫ్ఏ ఉద్యోగి
X

దిశ, సిటీబ్యూరో: దిశ తెలుగు దిన పత్రికలో గత నెల 31న బట్టలిప్పి కొడతా అనే శీర్షికతో హైదరాబాద్ టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన వార్తకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి, ఘటన జరిగిన శేరిలింగంపల్లి బల్దియా సిబ్బందిని, నిందితుడిని శనివారం విచారణకు రావాలని ఆదేశించగా సదరు ఎస్ఎఫ్ఏ విచారణకు సైతం డుమ్మా కొట్టారు. ఆ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ నగేశ్, డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డితో పాటు ప్రాజెక్టు ఆఫీసర్, బాధితులు బుద్దభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి శనివారం వచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవటంతో త్వరలోనే విచారణకు మరో తేదీని ఇస్తామని, బాధితులు విచారణకు రావల్సిన అవసరం లేదని కమిషన్ కార్యాలయ సిబ్బంది చెప్పినట్లు సమాచారం. సదరు ఎస్ఎఫ్ఏ తన ఉద్యోగం పోయినా ఫర్వాలేదు, తాను మాత్రం విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.

బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

మహిళా స్వీపర్‌ను దూషించటంతో పాటు మహిళా కమిషన్ ఆదేశాలను సైతం లెక్కచేయని సదరు ఎస్ఎఫ్ఏపై కఠిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జీ.రాజేశ్వర్ రావు, జనరల్ సెక్రటరీ టీ.కృష్ణ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సోమవారం ఈ వ్యవహారంపై కమిషనర్ ఆమ్రపాలికి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed