ఉద్రిక్తతల మధ్య యాదవుల ఛలో గాంధీభవన్ ముట్టడికి యత్నం..

by Sumithra |
ఉద్రిక్తతల మధ్య యాదవుల ఛలో గాంధీభవన్ ముట్టడికి యత్నం..
X

దిశ, ముషీరాబాద్ : గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ తమ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యాదవ కురుమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం పెద్దఎత్తున మహా ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాధర్నా అనంతరం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఛలో గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరగా ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరగడంతో ధర్నాచౌక్ లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంత ముందు జరిగిన మహాధర్నాలు పాల్గొన్న జేఏసీ నేతలు కడారి అంజయ్య యాదవ్, కో - కన్వీనర్ కోసుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బేషరతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, గొల్ల కురుమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కనిపించినా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గొల్ల కురుమల పట్ల చేసిన వ్యాఖ్యలు అగ్రకుల దురహంకారానికి నిదర్శనంగా ఉన్నాయని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా, రేవంత్ రెడ్డి వైఖరా అనేది స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా రాష్ట్ర తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్ హాజరయ్యారు. విధానాలు శ్రీహరి యాదవ్, రాములు యాదవ్, గోవర్ధన్ యాదవ్, మల్లేష్ కురుమ తదితరులతో పాటు పెద్ద ఎత్తున యాదవులు తరలివచ్చారు.

Advertisement

Next Story

Most Viewed