మత విద్వేష ప్రసంగాలు విని.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంపై దాడి

by Kalyani |
మత విద్వేష ప్రసంగాలు విని.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంపై దాడి
X

దిశ, సిటీ క్రైమ్: సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం సంఘటన లో కలవరం రేపే అంశాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలను పసిగట్టడంలో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు ఘోరంగా విఫలమయ్యాయి. స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్ ఐ బి, ఇతర నిఘా విభాగాల ఆఫీసర్స్ విఫలమైన తీరును ఈ సంఘటన స్పష్టం చేసింది. ఈ విభాగాల నిర్లక్ష్యపు పనితీరు పై సొంత పోలీసు శాఖలోనే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేవలం హిందూ మతం పై రెచ్చగొట్టేందుకే మోటివేషనల్ స్పీకర్ మునావర్ జామా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ముసుగులో ఏర్పాటు చేసిన నెల రోజుల కార్యక్రమం హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్లాసులో పాల్గొని మతోన్మాది గా మారిన సల్మాన్ చివరకు ముత్యాలమ్మ దేవాలయంలో దాడికి ప్రేరేపితుడయ్యాడని తేలింది. ప్రాధమికంగా దర్యాప్తు తో వెలుగు చూసిన ఈ విషయాల పై గోపాలపురం సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు మోటివేషనల్ స్పీకర్ మునావర్ జామా, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ బషీర్ అహ్మద్, హోటల్ మేనేజర్ రెహ్మాన్ లపై రెండో ఎఫ్ఐఆర్ ను మంగళవారం నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ 349 కింద బీఎన్ఎస్ సెక్షన్లు 299, 192, 196, 223, 49 కింద అభియోగాలను నమోదు చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదులో ఇలా…

ఈ నెల 14వ తేదిన తెల్లవారు జాము 4.40 గుర్తు తెలియని వ్యక్తి ముత్యాలమ్మ దేవాలయం లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి మిగతా సామాగ్రిని చిందరవందర చేశాడు. విచారణలో ఈ సంఘటనకు పాల్పడింది మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అని తెలిసింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన అతను మెట్రో పోలీస్ హోటల్ లో రూం బుక్ చేసుకున్నాడు. సల్మాన్ మహరాష్ట నుంచి హైదరాబాద్ కు మెట్రో పోలీస్ హోటల్ లో అక్టోబర్ 1 నుంచి 31 వరకు మోటివేషనల్ స్పీకర్ మునావర్ జామా నిర్వహిస్తున్న తరగతులకు వచ్చాడని తేలింది. అయితే మునావర్ జామా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని తెలిసి సల్మాన్ ఈ కాన్ఫరెన్స్ కు వచ్చాడు. దీని కోసం దేశవ్యాప్తంగా 151 మంది సభ్యులు పాల్గొంటున్నారని తెలుసుకున్నాడు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న వారందరికీ మెట్రో పోలీస్ హోటల్ లో 49 గదులలో వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మునావర్ జామా ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఈ భారీ కార్యక్రమాన్ని హోటల్ యజమాని, మేనేజర్ లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చారు. వివిధ వర్గాల మతాల మధ్య చిచ్చు రేపి అశాంతి, గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారని తెలిసింది. ఈ తరగతులకు హాజరయ్యి, మునవార్ జామా ప్రసంగాలను విన్న తర్వాతనే సల్మాన్ రెచ్చిపోయి ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ ఎల్.సురేష్ కోరారు.

జాకీర్ నాయక్ విడియోలు చూసి…

బుధవారం హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్టు చేసిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ (30) మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు అక్టోబర్ లో వచ్చాడు. ఇంగ్లీషు హౌజ్ అకాడమీ నిర్వహిస్తున్న పర్సనాలిటీ డెవలెప్మెంట్ క్లాస్ లో పాల్గొనడానికి వచ్చాడు. ఈ కార్యక్రమాన్ని మునావర్ జామా, మహ్మాద్ కాఫీల్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని విచారణలో తెలిసింది. బీటెక్ కంప్యూటర్ విద్యాభ్యాసం చేసిన సలీం ఇస్లాం మతం గొప్పతనం గురించి ప్రసంగాలు చేసే వారి వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్ లలో తరచు చూసేవాడు. ముఖ్యంగా జాకీర్ నాయక్ ప్రసంగాలను బాగా చూసి ప్రేరేపితుడయ్యాడు. అలా సలీం మతోన్మాది గా మారి హిందూ, ఇతర మతాల పై ద్వేషాన్ని పెంచుకున్నాడు. ముంబాయిలో కూడా సలీం పై ఇదే తరహాలో రెండు సంఘటనలకు పాల్పడడంతో అతని పై కేసులు నమోదైనట్లు గుర్తించాము. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని పోలీసు అధికారులు వివరించారు.

అనుమతి తీసుకోవాల్సిందే…

తాజా సంఘటన తో ఉలిక్కిపడ్డ హైదరాబాద్ పోలీసులు బుధవారం నార్త్ జోన్ పరిధిలోని దాదాపు 200 మంది లాడ్జిలు, హోటల్స్ యజమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒకరు హోటల్స్, లాడ్జులకు వచ్చి వెళ్ళే వారి వివరాలు, ధ్రువీకరణ పత్రాలను సేకరించుకోవాలి. ఫోన్ నెంబర్లను తీసుకోవాలి. ప్రతి కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి. రిజిస్టర్ లు మెయింటెయిన్ చేయాలి. సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. వాటి డాటాను భద్రపరచుకోవాలి. డోర్ ఫ్రేమ్, హ్యాండ్ ఫ్రేమ్ డిటెక్టర్ తో తనిఖీలు చేయాలి. పోలీసులు సూచించిన అన్ని భద్రతా ఏర్పాట్లను పెట్టాలి. నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story