టేస్టీ ఫుడ్‌లో నాణ్యతేదీ..?

by Aamani |
టేస్టీ ఫుడ్‌లో నాణ్యతేదీ..?
X

దిశ,చైతన్యపురి : ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు, వంట చేసుకునే ఓపిక లేని కుటుంబాలు, బ్యాచిలర్స్ బయట ఫుడ్‌కు అలవాటుపడ్డారు. బిర్యానీ తినాలని నోరు ఊరిస్తుండడంతో వీకెండ్‌లలో పిల్లాపాపలతో రెస్టారెంట్‌లలో ఆటవిడుపుగా భోజనం ఆరగిస్తున్నారు. దీంతో శని, ఆదివారాలు రెస్టారెంట్‌లు ఫుల్‌గా నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఇవేమి పట్టనట్లుగా వినియోగదారులు వ్యవహరిస్తున్నారు. తద్వారా అనారోగ్యం పాలవుతున్నారు.

కల్తీ ఫుడ్‌లో హైదరాబాద్ అగ్రస్థానం..

బిర్యానీ రుచులలో దేశంలోని అన్ని సిటీలను వెనక్కి నెట్టేస్తూ హైదరాబాద్ అగ్రశ్రేణిలో నిలిచింది. దేశ విదేశాలలో హైదరాబాద్ బిర్యానీకి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. బిర్యానీకి ఎంత ప్రాచుర్యం ఉందో ఆహారకల్తీకి సైతం నగరం అంతే ప్రాచుర్యం పొందింది. కల్తీ ఫుడ్ దొరికే నగరాలలో హైదరాబాద్‌కు అగ్రస్థానం దక్కింది. అయినా భోజనం ప్రియులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 19 నగరాలలో సర్వే చేసింది. ఈ నగరాలలో రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ ఐటెంల వివరాలు సేకరించగా దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి.

పుట్టగొడుగుల్లా రెస్టారెంట్లు..

ఎల్బీనగర్ జోన్‌లో పుట్టగొడుగులుగా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు రెస్టారెంట్లు ఏర్పాటు చేసి లాభార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. చిన్నాచితక రెస్టారెంట్లతో పాటు పేరుగాంచిన రెస్టారెంట్లు సైతం ఎక్కడా క్వాలిటీ పాటించకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. సగానికి పైగా రెస్టారెంట్లు కాలం చెల్లిన ఆహార పదార్థాలను వాడుతున్నట్టు అధికారిక లెక్కలు తేల్చాయి.

ఇటీవల కొన్ని సంఘటనలు..

రెస్టారెంట్లలో నాణ్యతలేని కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్న కొన్ని సంఘటనలు ఇటివల కనిపించాయి. నాలుగు నెలల క్రితం కొత్తపేట ప్రధాన రహదారిపై ఉన్న కృతుంగా రెస్టారెంట్‌కు వచ్చిన వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక వచ్చింది. దీంతో కస్టమర్లు అవాక్కయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారమిచ్చిన చర్యలు తీసుకోలేదని తెలిసింది. అలకాపురి చౌరస్తాలో ఉన్న లక్కీ రెస్టారెంట్‌లోనూ ఇదే పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి నాసిరకం పదార్థాలను గుర్తించి కేసు నమోదు చేశారు. అయినా తీరు మారలేదు. ఇవే కాకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా, ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయని హోటల్స్ రెస్టారెంట్లు నగరంలో చాలానే ఉన్నట్టు సమాచారం. అధికారులకు నెల నెలా మామూళ్లు అందుతున్నందునే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనికి క్రితుంగా రెస్టారెంట్ పై చర్యలు తీసుకోకపోవడం నిదర్శనంగా నిలుస్తుంది.

Next Story