పింక్ మయంగా మారిన నగరంలోని ప్రధాన కట్టడాలు.. అసలు కారణం ఇదే..?

by Mahesh |
పింక్ మయంగా మారిన నగరంలోని ప్రధాన కట్టడాలు.. అసలు కారణం ఇదే..?
X

దిశ, శేరిలింగంపల్లి: అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల ప్రారంభాన్ని పురస్కరించుకొని ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్ ఐమాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, కిమ్స్ ఆసుపత్రులను పింక్ రంగులో విద్యుత్ దీపాలతో అలంకరించారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచడంలో భాగంగా ఈ కట్టడాలు పింక్ రంగులో వెలిగించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ పి. రఘురామ్ మాట్లాడుతూ.. ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, ముఖ్యమైన భవనాలు ఉన్న నగరం హైదరాబాద్ అని, పింక్ రంగులో వెలిగిన నగరం మన భాగ్యనగరం అన్నారు.

'పెయింట్ ది సిటీ పింక్' ప్రచారంలో భాగంగా.. రొమ్ము క్యాన్సర్ పై పోరాడుతున్న మహిళలకు ధైర్యం, ఆశను కల్పించడమే తమ ఉద్దేశం అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మామోగ్రామ్ చేయించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వైట్‌హౌస్, ఎమ్పైర్ స్టేట్ బిల్డింగ్, బక్కింగ్ హామ్ ప్యాలెస్, టవర్ ఆఫ్ లండన్, ఐఫిల్ టవర్ వంటి ప్రసిద్ధ కట్టడాలు అక్టోబర్ నెలలో పింక్ రంగులో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. 2007లో స్థాపించబడిన ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ గత 17 ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన పెంచడంలో ఉత్సాహంతో పని చేస్తుందని తెలిపారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్ ఐమాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, కిమ్స్ ఆసుపత్రి పింక్ రంగులో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed