Kolkata Murder Case : మమత సర్కారుకు మరోసారి ‘సుప్రీం’ మొట్టికాయలు

by Hajipasha |
Kolkata Murder Case : మమత సర్కారుకు మరోసారి ‘సుప్రీం’ మొట్టికాయలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్‌ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఉదంతంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు టాయిలెట్లు, సెపరేటు రెస్టింగ్ రూంలను నిర్మించాలని తాము ఇచ్చిన ఆదేశాలు అమలవడం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ పేర్కొంది. ‘‘ఆగస్టు 9 నుంచి జరుగుతున్న పనుల తీరును మేం ట్రాక్ చేస్తూనే ఉన్నాం. ఏ ఒక్కచోట కూడా కనీసం 50 శాతం పనులను ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకింత జాప్యం ?’’ అని రాష్ట్ర సర్కారును సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

ఈపనులను అక్టోబరు 15లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. వైద్యులు, ఆస్పత్రుల భద్రత కోసం తాము నిర్దేశించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిపై స్టేటస్ రిపోర్టును ఇవ్వాలని కేంద్రం తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కోర్టు సూచించింది. ఇక బెంగాల్‌లో ఇప్పటికీ రెసిడెంట్ డాక్టర్లు ఇన్ పేషెంట్, ఓపీ సేవలకు హాజరుకావడం లేదని న్యాయస్థానానికి బెంగాల్ సర్కారు తెలిపింది. అయితే ఈ వాదనతో రెసిడెంట్ డాక్టర్స్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ విభేదించారు. అన్ని దైనందిన, అత్యవసర వైద్యసేవలను డాక్టర్లు అందిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed