Fake Currency: అనుపమ్ ఖేర్ ఫోటోతో నకిలీ నోట్లు.. గుజరాత్ వ్యాపారిని బురిడి కొట్టించిన మోసగాళ్లు

by S Gopi |
Fake Currency: అనుపమ్ ఖేర్ ఫోటోతో నకిలీ నోట్లు.. గుజరాత్ వ్యాపారిని బురిడి కొట్టించిన మోసగాళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఓ వ్యాపారిని హిందీ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉన్న నకిలీ కరెన్సీ నోట్లతో మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి నుంచి మోసగాళ్లు రూ. 1.3 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బంగారం, వెండి వ్యాపారం నిర్వహిస్తున్న మెహుల్ థక్కర్ తనకు తెలిసిన లక్ష్మీ జ్యువెలర్స్ మేనేజర్ నుంచి సెప్టెంబర్ 23న రెండు కిలోల బంగారం కొనుగోలు, ఇతర వివరాల కోసం నకిలీ ఫోన్ వచ్చింది. లక్ష్మీ జువెలర్స్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉన్న కారణంగా థక్కర్ నమ్మకంగా రూ.1.6 కోట్లకు డీల్‌ చేసుకున్నాడు. ఆర్‌టీజీఎస్‌లో సాంకేతిక సమస్య వల్ల నగదు రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌ని ఇస్తామని మోసగాళ్లు నమ్మించారు. మిగిలిన మొత్తాన్ని తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు.

నవరంగ్‌పురా ప్రాంతంలోని అంగాడియా (సాంప్రదాయ మనీ కొరియర్) సంస్థలో బంగారాన్ని మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు. బంగారాన్ని డెలివరీ చేయడానికి థక్కర్ తన ఉద్యోగిని పంపారు. ముగ్గురు వ్యక్తులను కలిసిన ఉద్యోగి బంగారాన్ని అప్పగించి నగదును తీసుకున్నాడు. అయితే, తర్వాత ఆ నోట్లను పరిశీలించగా అవి నకిలీ నోట్లని గుర్తించారు. సదరు నోట్లపై మహాత్మ గాంధీ బొమ్మకు బదులుగా నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాంప్ ఉంది. మోసపోయినట్టు గ్రహించిన మెహుల్ థక్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. దీనిపై స్పందించిన అనుపమ్ ఖేర్.. గాంధీ ఫోటో బదులు తన ఫోటోనా? ఈరోజుల్లో ఏదైనా జరగొచ్చు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed