దిశ కథనానికి అనూహ్య స్పందన.. విచారణలో బయటపడ్డ రూ. 1.73 కోట్ల అవినీతి

by Mahesh |
దిశ కథనానికి అనూహ్య స్పందన.. విచారణలో బయటపడ్డ రూ. 1.73 కోట్ల అవినీతి
X

దిశ, జడ్చర్ల: దిశ దినపత్రికలో ఈనెల 17వ తేదీన " పోలేపల్లి పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్ ? " శీర్షికన ప్రచురితమైన వార్తకు అనూహ్యమైన స్పందన లభించింది. వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తక్షణమే స్పందించి డీఎల్‌పీ‌ఓ పండరీనాథ్‌తో గ్రామపంచాయతీ రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి సమగ్ర విచారణ జరిపించారు. డీఎల్‌పీఓ పండరీనాథ్ తన సమగ్ర విచారణలో పోలేపల్లి గ్రామ పంచాయతీలో రూ.1.73 కోట్ల పైచిలుకు అవినీతి జరిగినట్లు తేల్చారు. అవినీతికి సంబంధించి గ్రామ సర్పంచ్ జనం పల్లి చేతనా రెడ్డిని, పూర్వపు పంచాయతీ కార్యదర్శి శివ ప్రకాశ్‌లను బాధ్యులను చేస్తూ సర్పంచ్ నుండి నిధుల రికవరీకి, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం కోసం జిల్లా కలెక్టర్‌కు డీఎల్‌పీఓ సిఫారసు చేశారు.

వివిధ గ్రాంట్ల క్రింద గ్రామ పంచాయతీ ద్వారా ఖర్చు చేసిన రూ.7,03,79,148 లలో రూ.1,73,20,013లకు సంబంధించి ఎలాంటి ఎంబి రికార్డులు, బిల్లులు, ఓచర్లు విచారణ సమయంలో పూర్వపు పంచాయతీ కార్యదర్శి శివ ప్రకాష్ విచారణ అధికారి పండరీ నాథ్ కు చూపకపోవడం వల్ల ఆ ఖర్చులను అసాధారణమైన, అసంబద్ధమైన, అభ్యంతరకరమైనవిగా తేల్చారు. పంచాయతీ నిధుల డ్రాయింగ్‌కు సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్ ల జాయింట్ సంతకం ఉంటుండటం వల్ల అందుకు చట్ట ప్రకారం పూర్తి బాధ్యత సర్పంచ్ దే. ఆ విషయంలో గ్రామ సర్పంచ్ జనంపల్లి చేతనా రెడ్డిని విచారణ అధికారి పండరీ నాథ్ బాధ్యురాలిని చేశారు. అలాగే నియమ నిబంధనలు పాటించకుండా గ్రామ పంచాయతీ నిధుల సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాల్సిన పూర్వపు పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ పూర్తి నిర్లక్ష్యంగా నిధుల సంరక్షణలో విఫలమైనట్లు కూడా డిఎల్‌పిఓ తన విచారణలో తేల్చారు.

అంతేకాక 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తి అయిన ఇప్పటివరకు అందుకు సంబంధించిన ఆడిట్ చేయించకపోవడాన్ని కూడా విచారణ అధికారి తప్పుపట్టారు. పోలేపల్లి గ్రామ సర్పంచ్ జనంపల్లి చేతన రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి సమీప బంధువైన కూడా ఆమె అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిన వెంటనే ఆమెపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బంధుత్వాలకు అతీతంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అవినీతి విషయంలో తన అన్న తప్పు చేసిన తన సమీప బంధువులు తప్పు చేసిన సహించబోమని పదే పదే చెబుతుంటారు. పోలేపల్లి పంచాయతీ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు సాదరంగా స్వాగతిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed