బల్దియా అధికారులకు తెలియదట !

by Sumithra |
బల్దియా అధికారులకు తెలియదట !
X

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ మహానగర పాలక సంస్థ గ్రీవెన్స్‌సెల్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. గ్రీవెన్స్‌కు వచ్చిన సందర్శకులను విస్తుగొల్పింది. సోమవారం వరంగల్‌ అండర్‌బ్రిడ్జి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్‌కు వచ్చాడు. అండర్‌బిడ్జ్రి కింద నిరంతరం మురుగు నిలుస్తున్నదని, నీరు నిల్వ లేకుండా చూడాలని కమిషనర్‌కు అర్జీ సమర్పించాడు. ఈ క్రమంలో అదే వేదికలో ఆసీనులైన సంబంధిత శాఖ అధికారి ఒకరు కాజీపేట బీడ్జీనా, ఏ అండర్‌బ్రిడ్జీ అనడంతో మిగతా సందర్శకులు విస్తుబోయారు.

వరంగల్‌లో ఎన్ని అండర్‌బ్రిడ్జీలు ఉన్నాయో కూడా తెలియకుండా ఉన్నారా ? అంటూ ముక్కున వేలేసుకున్నారు. నగరంలోని ప్రాంతాలు కూడా తెలియకుండా విధులు నిర్వర్తిస్తున్నారంటూ ప్రశ్నలు సంధించారు. అధికారుల తీరు పై ఫిర్యాదుదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గ్రీవెన్స్‌సెల్‌లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం ఫిర్యాదుదారుడిని బల్దియా సిబ్బంది బయటకు పంపించడంతో అంతా సద్దుమణిగింది. కాగా, సదరు ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారికి సిఫారసు చేశారు.

అండర్‌బ్రిడ్జి వద్ద డ్రెయినేజీ అస్తవ్యస్తం..

వాస్తవంగా అండర్‌బ్రిడ్జి వద్ద డ్రెయినేజీ అధ్వానంగా తయారైంది. బ్రిడ్జి అవతలి ప్రాతం నుంచి వచ్చే మురుగు కాల్వ.. బ్రిడ్జి ఇవతలి వైపు ఏ కాల్వకు అనుసంధానం చేసి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి నుంచి రైల్వేగేటు వైపు మార్గంలో ఒకవైపు మాత్రమే గల మురుగు కాల్వ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. అసలు అందులో నీరు ఎటూ కదలలేని స్థితిలో ఉంది. ఈ అస్త్యవస్తమైన డ్రెయినేజీతో మురుగు నీరు అండర్‌బ్రిడ్జి కిందకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అదీగాక, ఇదే బ్రిడ్జి ఏరియాలో రైల్వే స్టేషన్‌వైపు గల కొండా పటేల్‌ కాలనీలో గల ఇళ్ల నుంచి కూడా రోడ్డుపైకి మురుగు నీరు చేరుతోందని స్థానికులు పలువురు చెబుతున్నారు. అదీగాక, కొత్తగా నిర్మిస్తున్న ఓ బడా భవనం నుంచి వ్యర్థపు నీరు రోడ్డుపైకి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపైనే స్థానికుడు ఒకరు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసేందుకు రావడం, అధికారులు వింత ప్రశ్న వేయడం... చర్చనీయాంశంగా మారింది.

శానిటేషన్‌ నిర్లక్ష్యం !

వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో అండర్‌బ్రిడ్జి ప్రాంతంలో శానిటేషన్‌ సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది. బిడ్జ్రి ప్రాంతంలో అండర్‌ డ్రెయినేజీ పైపులైన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఆ పైపులైన్‌లో చెత్తాచెదారం చేరుకుని నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఫలితంగా మురికి నీరు వంపులో ఉన్న అండర్‌బ్రిడ్జి రోడ్డు మీదకు చేరుకుంటోంది. ఈ సమస్య కొంతకాలంగా ఉన్నప్పటికీ శానిటేషన్‌ సిబ్బంది బిడ్జ్రి గోడను ఆనుకుని మట్టితో అడ్డుకట్ట వేయడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. డ్రెయినేజీ లోపాలను పసిగట్టి పరిష్కరించాల్సింది పోయి.. మట్టితో అడ్డుకట్ట వేసి చేతులు దులుపుకోవడం పారిశుధ్య నిర్వహణ పై వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

Advertisement

Next Story

Most Viewed