Mahesh Kumar Goud: బీఆర్ఎస్ లీడర్లకు సోషల్ సెన్స్ లేదు

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: బీఆర్ఎస్ లీడర్లకు సోషల్ సెన్స్ లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్ల పాలనలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లు కేటీఆర్, హరీశ్‌రావు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ జన్వాడ, ఎర్రవెల్లితో పాటు కవిత, హరీశ్‌రావు ఫామ్ హౌజ్‌లు రావడమే డెవలప్‌మెంట్ కాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫామ్ హౌజ్ కల్చర్ ఉండదని, సిటీ అభివృద్ధి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ప్రజలపై చేసిన అకృత్యాలను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నెల రోజుల వ్యవధిలోనే రెండు లక్షల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, దీనిపై ఎక్కడ చర్చి పెట్టినా, ఎప్పుడు పిలిచినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, హరీశ్‌రావు అందుకు రెడీయా అని సవాలు విసిరారు. పదేండ్లలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రంమీద పడి దోచుకున్నదని, ఇప్పుడు సంక్షేమాన్ని అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హతే లేదన్నారు.

నేరెళ్ళలో దళితులపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌తో ఇప్పటికీ యువకులు పని చేయలేకపోతున్నరని మహేశ్ గౌడ్ గుర్తుచేశారు. హైడ్రాను బూచిగా చూపిస్తున్న బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారానికి దిగుతున్నారని, ఇతర రాష్ట్రాల్లోజరిగిన ఘటనలను వీడియో ద్వారా ప్రదర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాక గందరగోళానికి, ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ అలాంటి అనైతిక చర్యలకు దిగదన్నారు. తప్పుడు వీడియోలతో దుష్పచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులనూ కోరుతున్నానని అన్నారు. చివరకు మహిళా మంత్రికి ఓ ప్రజా ప్రతినిధి చేనేతకు సింబాలిక్‌గా నూలుపోగులతో తయారైన దండను వేసినా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసేంత నీచ స్థాయికి బీఆర్ఎస్ దిగజారిందన్నారు. పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి హామీ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ మోసం చేశారని పేర్కొన్నారు.

హైడ్రా విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్న బీఆర్ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులు కబ్జాలు చేసినవారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ఏదో ఒక రోజు జైలుకు వెళ్లక తప్పదన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం లేదా హైడ్రా ఇప్పటిదాకా ఒక్క గుడిసెను కూడా తొలగించలేదని, పేదలు రోడ్డుమీద పడకూడదన్న ఉద్దేశంతోనే వారికి అవగాహన కలిగించి పునరావాసం కూడా అందిస్తున్నామన్నారు. నదికి మానవునికి అవినాభావ సంబంధం ఉన్నదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విడుదల చేసిన కలుషిత నదుల జాబితాలో మూసీ నది ముందు వరుసలో ఉన్నదన్నారు. ఈ నది పరిసరాల్లో దాదాపు పాతిక లక్షల మంది జీవిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులు కబ్జాకు గురయ్యాయని, ఇందులో ఆ పార్టీ నేతలతో పాటు బీజేపీ లీడర్లు కూడా ఉన్నారని గుర్తుచేశారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చుతామని 2016లోనే కేసీఆర్ ఓపెన్‌గా చెప్పారని ఉదహరించారు.

ప్రకృతి ధ్వంసంతో వయనాడులో ఇటీవల దుర్భర పరిస్థితిని చూశామని, హైదారాబాద్‌లో ఇలాంటి పరిస్థితి రావద్దనే హైడ్రా వ్యవస్థతో పాటు మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. చివరకు భువనగిరి గుట్టలు కూడా బీఆర్ఎస్ నేతల భూ దాహానికి ఖాళీ అయ్యాయన్నారు. హైడ్రాను భూతంగా చూపించి పేద ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు ఆనాడు కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా విషయంలో 90% మంది శాతం ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. మూడు జిల్లాల్లో ఉధృతంగా వరదలు వచ్చి జనాలు నష్టపోతే కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

మహిళను అవమానపరచడం బీఆర్ఎస్‌ నైజమని ఆరోపించిన పీసీసీ చీఫ్... తొలి టర్ములో ఒక్క మహిళకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదన్నారు. మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం ఉన్నందునే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయినప్పుడు ఆమెపై వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్లు చేయలేదని గుర్తుచేశారు. ఆమెను ఒక మహిళ అనే కోణంగా గౌరవప్రదంగానే చూశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపైనా బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులతో హేళనగా ప్రవర్తిస్తున్నదని, నిజంగా ఆ సెక్షన్ ప్రజలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు బదులు వ్యక్తిగత విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed