HYD : మియాపూర్ కాల్పుల ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-24 06:31:25.0  )
HYD : మియాపూర్ కాల్పుల ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మదీనగూడ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి దేవేందర్ గాయాన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడే నాలుగు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మదీనగూడలోని సందర్శిని ఎలైట్ హోటల్‌లో పనిచేస్తున్న దేవేందర్ గాయాన్ అనే వ్యక్తిపై గతరాత్రి జరిపిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ దేవందర్ మృతి చెందారు. అయితే అదే హోటల్‌లో పనిచేసి ఇటీవలే తొలగించబడ్డ రితీష్ నాయర్ మృతుడు దేవేందర్ మధ్య నెల రోజుల క్రితం ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగిందని, ఈక్రమంలో రితీష్ నాయర్ దేవేందర్‌పై చేయిచేసుకున్నాడని సమాచారం.

ఈ ఘటనపై దేవేందర్ సందర్శిని హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో హోటల్ యాజమాన్యం రితేష్‌ను విధుల్లో నుండి తొలగించింది. ఈ నేపథ్యంలో దేవేందర్‌పై కక్ష్య పెంచుకున్న రితేష్ నాటు తుపాకిని సమకూర్చుకున్నాడు. గతరాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన దేవేందర్‌తో సందర్శిని హోటల్, కియా షోరూం మధ్య రోడ్డులో మరోసారి ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో తన వద్ద ఉన్న తుపాకితో దేవేందర్‌పై 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన దేవేందర్ సమీపంలోని అర్చన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story