తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్‌

by Mahesh |   ( Updated:2023-05-01 08:17:02.0  )
తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: మంత్రి కేటీఆర్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఫుడ్‌ కాంక్లేవ్‌ - 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం నడు ఐదు రెవల్యూషన్స్ తీసుకొచ్చిందని, తెలంగాణ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతుందని తెలిపారు. మత్స్య సంపదలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామనన్నారు.

పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హార్టికల్చర్, డైరీ రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, వెటర్నరీ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, తాము తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ పనితీరు చాలా బాగుందన్నారు. రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేరుగా ఎవరిని కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యూనిట్లు ఏర్పాటు చేస్తే అందుకు కావలసిన ముడిపదార్థాలను గ్రామీణ ప్రాంతాల నుంచి అందించేందుకు అధికారులు సహకారం అందిస్తారని తెలిపారు. దళిత బంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షలతో నలుగురు కలిసి 40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.

చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. తెలంగాణలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు పనిచేస్తున్నారని వెల్లడించారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, పత్తి పండిస్తున్న రాష్ట్రం కూడా తమదేనని పేర్కొన్నారు. టెక్స్‎టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు రాష్ట్రం నుంచి లభిస్తాయన్నారు. విజయ డైరీ కూడా లాభాల బాటలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed