రాష్ట్రంలో భారీగా భూముల ధరలు పెంపు.. మరోసారి ‘క్రాస్ చెక్’కు మంత్రి పొంగులేటి ఆదేశం

by Gantepaka Srikanth |
రాష్ట్రంలో భారీగా భూముల ధరలు పెంపు.. మరోసారి ‘క్రాస్ చెక్’కు మంత్రి పొంగులేటి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దీనికి సంబంధించి జూన్ 15 నుంచి కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని షెడ్యూల్ ప్రకటించింది. మార్కెట్ వాల్యూ రివిజన్‌పై ఇప్పటికే ఒకసారి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఆగమేఘాల మీద మార్కెట్ విలువలను పెంచితే ఇబ్బందులు తప్పవని గుర్తించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ‘క్రాస్ చెక్’కు ఆదేశించారు. అందుకే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా రియలిస్టిక్ రేట్స్‌పై స్టడీ చేయాలని నిర్ణయించారు. థర్డ్ పార్టీ ఇచ్చే నివేదిక ఆధారంగా మార్కెట్ విలువల పెంపు ఉండే అవకాశం ఉంది.

అసమగ్రతకు తావు లేకుండా ఉండేందుకు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ విలువలను రెండుసార్లు రివిజన్ చేసింది. అయితే ప్రజలు, క్షేత్రస్థాయి అధికారులను సంప్రదించకుండా.. సీఎం కేసీఆర్, మరికొందరు ఉన్నతాధికారులు కూర్చొని మార్కెట్ విలువలు ఖరారు చేశారని కాంగ్రెస్ గతంలో అనేకసార్లు ఆరోపించింది. దీంతో శాస్త్రీయత లోపించి బహిరంగ విలువ ఎక్కువగా ఉన్న చోట తక్కువ మార్కెట్ వాల్యూ, అవసరం లేని చోట డబుల్ వాల్యూ చేశారని విమర్శించింది. దీంతో ఇప్పుడు అసమగ్రతకు తావు లేకుండా మార్కెట్ వాల్యూను నిర్ణయించాలని భావిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే భూములు, స్థలాల మార్కెట్ విలువల పెంపు ప్రక్రియ మరికొద్ది రోజులు పెండింగ్ పడినట్లే కనిపిస్తున్నది.

సంప్రదింపులతోనే ఖరారు

కొత్త మార్కెట్ విలువలపై అధ్యయనం చేయడానికి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ జూన్‌లో సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 18 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు షెడ్యూల్ ప్రకటించారు. మార్కెట్ విలువల రివిజన్‌పై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రైతు ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బహిరంగ మార్కెట్ విలువలను సేకరించారు. రిజిస్ట్రేషన్ విలువలతో సరిపోల్చుకున్నారు. ఏ మేరకు పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీతోనూ ఓపెన్ మార్కెట్‌లో ల్యాండ్ వాల్యూస్‌పై స్టడీ చేయిస్తున్నది. ఈ ఏజెన్సీ కూడా పలువురిని సంప్రదించిన తర్వాతే రిపోర్ట్ ఇవ్వనున్నది. ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. మరోవైపు ఎక్కడైతే భూముల ధరలు పెరిగాయో ఆ ఏరియాలోనే రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

కొత్త ‘ప్రాజెక్టు’లతో పెరిగిన రేట్లు

– ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ని ప్రకటించింది. ఆ ఏరియాలో ఏయే ప్రాజెక్టులు, ఏయే సంస్థలు రానున్నాయో అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోగా రేట్లు కూడా పెరిగినట్లు తెలుస్తున్నది.

– మొన్నటి వరకు ‘నియర్ ఫార్మా సిటీ’ అని ప్రచారం చేసుకున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆశించిన బిజినెస్ జరగలేదు. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు ‘నియర్ ఫోర్త్ సిటీ’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పారిశ్రామిక వాడల ఏర్పాటుకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాంతో శ్రీశైలం హైవేలో ధరలు అమాంతంగా పెరిగాయి.

– ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. దాంతో రెండు లేదా మూడు కార్పొరేషన్లతో అభివృద్ధి జరగనుందన్న ప్రచారం మొదలైంది. శివారు ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన కూడా గ్రేటర్ హైదరాబాద్ స్థాయిలోనే ఉంటాయని విశ్వసిస్తున్నారు. దాంతో ఈ ఏరియాకూ ఫుల్ డిమాండ్ వచ్చింది.

– మొన్నటి వరకు చెరువులు, కుంటలు కబ్జా చేసి లే అవుట్లు వేశారు. వర్షాలు కురిస్తే చాలు.. ఆ ప్లాట్లు, ఇండ్లు నీట మునుగుతున్నాయి. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. ఒక్కో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేస్తున్నది. దాంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది.

– కొత్త ఆర్వోఆర్ చట్టంలోనూ ప్రతి రిజిస్ట్రేషన్ కి సర్వే మ్యాప్ ఉండాలని సూచించారు. ఇది ఆషామాషీ కాదు. ప్రతి ల్యాండ్ పార్శిల్ కి చట్టబద్ధత లభిస్తుంది. ఏ వివాదం తలెత్తకుండా భూములు కొనుగోలు చేసిన వారికి భరోసా ఇస్తుంది.

– రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇలాంటి అనేక పాజిటివ్ రీజన్స్ తో రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకోనున్నది.

ట్రిపుల్ ఆర్‌తో మారనున్న స్వరూపం

రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్నది. అందుకే పలుమార్లు కేంద్ర మంత్రులతోనూ సంప్రదించింది. భూ సేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదిక చేపట్టింది. నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రాజెక్టు గాడిలో పడితే రాష్ట్ర స్వరూపమే మారనున్నది. సగం రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అమాంతంగా భూముల ధరలు పెరగనున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో పాటు పలు రోడ్లు, పలు నగరాలకు రింగ్ రోడ్లు ప్రతిపాదించారు. కొన్ని ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి వేగం మరింత పెరగనున్నది. ఇలాంటి అనేకాంశాలను పరిగణనలోకి తీసుకొని థర్డ్ పార్టీ ఏజెన్సీ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

25న అధికారుల సమావేశం

రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరల పెంపు/రివిజన్ ప్రక్రియపై ఈ నెల 25న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు సమావేశం కానున్నారు. మరోసారి దీనిపై చర్చించనున్నారు. అలాగే పొటెన్షియల్ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రైవేటు ఏజెన్సీ రూపొందించిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని రియలిస్టిక్ గా ఉండే రివిజన్ ని చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది తెలియదన్నారు.

Advertisement

Next Story

Most Viewed