Jammikunta : జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు.. భారీగా ఆస్తి నష్టం

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-27 06:49:59.0  )
Jammikunta : జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు.. భారీగా ఆస్తి నష్టం
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద నీటితో మునిగిపోయింది. 6వ వార్డు పరిధిలోకి వచ్చే హౌసింగ్ బోర్డ్ కాలనీ భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీ మొత్తం నీట మునగడం రివాజుగా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో బుధవారం రాత్రి కాలనీవాసులంతా తమ ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఉలిక్కిపడ్డారు. సుమారుగా ఈ కాలనీలో 4 వందల పైగా ఇళ్లు ఉండగా అవన్నీ కూడా నీట మునిగాయి. దీంతో ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్‌లు, టీవీలు, బియ్యం, నిత్యావసర సరుకులను సర్వం కోల్పోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కాలనీవాసులు తెలిపారు.

వాటితో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వీటితో పాటు పట్టణ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, మోత్కులగూడెంలోని కొంత భాగం, నీట మునిగాయి. కాగా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో అత్యధికంగా 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో దీని ప్రభావంతో అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందదోనని జమ్మికుంట పట్టణంతో పాటు ఇల్లందకుంట గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed