'ఆ నేరాలపై దృష్టి పెట్టండి'.. పోలీసులకు హోం మంత్రి సూచన

by Vinod kumar |
ఆ నేరాలపై దృష్టి పెట్టండి.. పోలీసులకు హోం మంత్రి సూచన
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇటీవలిగా భూ సంబంధిత నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హోం మంత్రి మహమూద్ అలీ సూచించారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్‌లు పెడుతూ సమస్యలు ఏర్పడటానికి కారణం అవుతున్న వారిని కట్టడి చెయ్యాలన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో జరుగుతున్న నేరాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాతబస్తీలోని బార్కస్, చంద్రాయణగుట్ట, పహాడీ షరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయని అన్నారు.

నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్లు, భారీ నిర్మాణాల వద్ద అసాంఘిక శక్తులు మద్యం, గంజాయి సేవిస్తున్నారని, వీరిపై నిఘా పెట్టాలన్నారు. పాతబస్తీలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్‌షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని చెప్పారు. ఇక, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, కమిషనర్లు ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీ. ఎస్. చౌహాన్ తోపాటు ఐపీఎస్ అధికారులు విక్రమ్ సింగ్ మాన్, మహేష్ భగవత్, గజరావు భూపాల్, రూపేష్, కిరణ్ ఖరే, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story