నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం

by Mahesh |
నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
X

దిశ, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో 8 టర్బైన్‌లు ఉండగా.. 2, 4వ నంబరు టర్బైన్‌లు మరమ్మతులకు గురై 6 నెలలవుతున్నా జెన్‌కో అధికారులు మరమ్మతులు పూర్తిచేయలేదు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నప్పటికీ జెన్‌కో అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశం లేకుండా పోయిందని నీటిపారుదల, విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. దీనిపై జెన్‌కో ఎస్‌ఈ రఘురాం మాట్లాడుతూ.. 1వ టర్బైన్‌ మినహా మిగిలిన 7 టర్బైన్‌లు జపాన్‌ నుంచి తెచ్చి ఏర్పాటు చేసినవని, మరమ్మతులకు జపాన్‌ నుంచే నిపుణులు రావాల్సి ఉందని చెప్పారు. జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది.

రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్‌లో ప్రతి రోజూ 100 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగావాట్ల చొప్పున 750 మెగావాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

Advertisement

Next Story