AP News:ఆ నియోజకవర్గంలో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-17 15:59:03.0  )
AP News:ఆ నియోజకవర్గంలో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
X

దిశ,నందికొట్కూరు: నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. జూపాడుబంగ్లా, మిడుతూరు, నందికొట్కూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లాయి. పంట పొలాలతో పాటు పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీ లోని హాజీ నగర్, మారుతి నగర్, హాస్పిటల్ రోడ్, చెంచు కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.

వర్షపు నీటి ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్

నందికొట్కూరు పట్టణంలో భారీ వర్షం వలన జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,14వ వార్డు కౌన్సిలర్ అశోక్‌లు పర్యటించారు. కాలనీవాసులకు వారు ధైర్యం చెప్పారు. పూడికతో నిండిన మురుగునీటి కాలువలలో జేసీబీతో పూడిక మట్టిని తొలగించారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు. వరదల కారణంగా నష్టపోయిన కాలనీ వాసుల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story