TPCC తీర్మానాలకు హై కమాండ్ ‘నో’ రెస్పాన్స్.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్స్..?

by Satheesh |   ( Updated:2024-03-09 16:37:57.0  )
TPCC తీర్మానాలకు హై కమాండ్ ‘నో’ రెస్పాన్స్.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్స్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ–కాంగ్రెస్ తీర్మానాలకు హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదనే చర్చ మొదలైనది. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మొదటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని పార్టీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఈ ఏడాది జనవరి 3న తీర్మానం చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కృతజ్ఞతగా ఎంపీగా గెలిపిస్తామని రాష్ట్ర నేతలు ధీమాగా వివరించారు. కానీ ఆ తర్వాత సోనియా గాంధీ ఆసక్తిగా లేరని ఢిల్లీ నుంచి తెలుసుకున్న రాష్ట్ర నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలైనా తమ రాష్ట్రం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ ముందు రిక్వెస్టు పెట్టారు. అయితే ఏఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గాంధీ ఫ్యామిలీ నుంచి తెలంగాణలో పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని పార్టీలోనే చర్చ కొనసాగుతున్నది.

ఇటీవల ఢిల్లీ వెళ్లి స్వయంగా సీఎం రేవంత్, డిప్యుటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటిలు కూడా సోనియా గాంధీ ఫ్యామిలీని పోటీ చేయాలని కోరారు. కానీ ఆ నేతల విన్నపాలను అధిష్టానం పక్కకు పెట్టిందనే చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచే మళ్లీ రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ప్రియాంక కూడా రాయ్‌బరేలి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో గాంధీ ఫ్యామిలీ తెలంగాణ నుంచి పోటీ చేయడం కష్టమేనని పార్టీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేయగా, టీపీసీసీ మాత్రం రాహుల్, ప్రియాంకల్లో ఒకరిని పోటీచేయించాల్సిందేనంటూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. దీని వలన ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో మెరుగైన ఫలితాలు వస్తాయనేది పార్టీ ఆశ. ఒక వైపు సీట్ల ఎంపికపై రాష్ట్రంలో హాట్ హాట్‌గా చర్చలు జరుగుతుండగా, గాంధీ ఫ్యామిలీ పోటీపై కూడా అదే స్థాయిలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed