కిషన్ రెడ్డిపై హైకమాండ్ వేటు.. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు?

by Sathputhe Rajesh |
కిషన్ రెడ్డిపై హైకమాండ్ వేటు.. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంతో పోల్చుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినా.. కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అయితే బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ తక్కువ స్థానాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. మరోవైపు పార్టీ ఒత్తిడి మేరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని విన్నవించుకున్నట్లు సమాచారం. దీంతో కిషన్ రెడ్డిని కొనసాగిద్దామా? మారుద్దామా? అని హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

పార్లమెంట్ ఎన్నికలు వస్తుండడంతో..

మరో ఆరు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రెసిడెంట్‌ను నియమిస్తే ఎలా అని అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రెసిడెంట్‌ను మార్చా్ల్సి వస్తే ఎవరికిస్తే బాగుంటుందనే అంశంపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు.

రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఒక వేళ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే వీరందరినీ పక్కన పెట్టి కొత్త నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

లోతుగా విశ్లేషణ

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచినా.. బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి సీనియర్లు ఓడిపోయారు. అయితే గెలిచిన 8 సెగ్మెంట్లలో ఏ అంశాలు కమలం పార్టీని విజయతీరాలకు చేర్చాయనేది పార్టీ అధిష్టానం లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బండి సంజయ్‌ను అకారణంగా తప్పించడం, లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకపోవడం, ఈటల రాజేందర్‌కు పార్టీలో ప్రాధాన్యతనివ్వడం, కిషన్ రెడ్డికే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతోనే ప్రతికూల ఫలితాలు వచ్చాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఈనేపథ్యంలోనే జాతీయ నాయకత్వం తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.

మెరుగైన ఫలితాలు సాధించేలా..

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెరుగైన ఫలితాలు సాధించేలా బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎక్కువ స్థానాలు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. 8 స్థానాల్లో విజయానికి ఏ అంశాలు పని చేశాయి? సీనియర్లు ఎందుకు ఓడిపోయారు? అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదం పనిచేసిందా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నినాదం పనిచేస్తుందా? లేదా? అనే అంశాలపైనా అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed