ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు.. ఏజెన్సీలో హై అలర్ట్!

by Sathputhe Rajesh |
ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు.. ఏజెన్సీలో హై అలర్ట్!
X

దిశ, కొత్తగూడ: మావోయిస్టు అమరుల వారోత్సవాలను విజయవంతం చేయడం కోసం మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28నుండి ఆగష్టు నెల మూడవ తేది వరకు నిర్వహించే వారోత్సవాలను విజయ వంతం చేయాలని సిపిఐ (మావోయిస్ట్) జేఎండబ్ల్యుపి మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గతేడాది నుండి రెండు వందల మందిపైగా మావోయిస్టులు అసువులు బాసినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారోత్సవాలను భగ్నం చేసేందుకు స్పెషల్ బలగాలతో పెద్ద ఎత్తున మోహరింపజేసి కూంబింగ్ చేపడుతున్నారు. కొత్తగూడ, గంగారం మండలాలు ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సరిహద్దులలో భారీగా బలగాలను మోహరించారు.

గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పలు మండలాలతో పాటు కొత్తగూడ, గంగారం, మండలాల్లో చాపకింద నీరులా మావోయిస్ట్ తమ కొరియర్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక వైపు మావోయిస్ట్ నక్సల్స్ చేస్తున్న చర్యలు మరోవైపు నక్సల్ కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలలో ఏజెన్సీలోని గిరిజన గ్రామాలలో భయానక వాతావరణం నెలకొంది. మావోల వారోత్సవాల నేపథ్యంలో దుశ్చర్యలను పాల్పడే అవకాశముందనే సూచనలతో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ కేకన్ వాటిని ముందే పసిగట్టి తిప్పి కొట్టాలని పటిష్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మావోలు ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు, పోలీస్ స్టేషన్ లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహించే అవకాశమున్నందున జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం చేస్తూ గూడూరు సిఐ బాబురావు అధ్వర్యంలో కొత్తగూడ, గంగారం పోలీస్ స్టేషన్‌ల ఎస్సైలు కుశకుమార్, రవికుమార్‌లు స్పెషల్ బలగాలతో గ్రామాలలో విస్తృత తనిఖీలు చేపట్టి వచ్చి పోయే వాహనదారులను పరిశీలించి కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీలో కొనసాగిన మాజీలు, లొంగిపోయిన వారిని అదుపులో తీసుకొని విచారించి వ్యక్తిగత పూచీకత్తుపై పంపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులను ఎలాంటి ముప్పు కలుగకుండా ఉండేందుకు మాజీలపై బాధ్యత పెట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు మావోల కదలికలు మరోవైపు పోలీసుల కౌన్సిలింగ్‌లతో మాజీల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

టార్గేట్ వ్యక్తులకు అలర్ట్

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపడుతున్నారు. అడుగడునా తనిఖీలు చేపడుతూ టార్గెట్ వ్యక్తులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు మావోలు చాపకింద నీరుల వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన పోలిసులు ముందస్తుగానే జిల్లాలోని మావోల టార్గేటర్లను మన గతంలో మావోలకు టార్గెట్‌గా మారిన వ్యక్తులను జాగ్రత్తగా ఉండటంతో పాటు కొద్ది రోజులు సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న పోలీసులకు వెంటనే సమాచారం తెలియచేయాలని సూచించినట్లు తెలుస్తుంది. కొంత మంది ప్రజా ప్రతినిధులను సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. కొంతమందిఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తుంది.

అజ్ఞాతం వీడాలి- ఎస్పీ సుధీర్ కేకన్

మావోయిస్టులు సిద్ధాంతాలతో హింస ద్వారా సాధించేది ఏమి లేదని జన జీవన స్రవంతిలో కలిసి ప్రజలతో ప్రశాంత జీవితం గడపాలని పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం నిత్యం పిలుపునిస్తుంది. అజ్ఞాతాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వామి కావాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీలో పని చేసిన ఎంతో మంది మావోయిస్టులు తమ విలువైన జీవితాలను కోల్పోయారు. నిజం తెలుసుకున్న మావోయిస్టులు చాలా మంది పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రభుత్వ పరంగా పునరావాస కల్పనతో పొందిన వారందరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు అని అన్నారు. స్వచ్చందంగా జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో హింస ద్వారా సాధించేది శూన్యం అన్నారు. ఈ విషయం తెలుసుకొని అర్థం చేసుకోని శాంతియుత వాతావరణం నెలకొల్పెందుకు కృషి చేయాలని కోరారు. మీరు స్వచ్చందంగా లొంగి పోతే ప్రభుత్వ పరంగా రావలసినవన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story