ఖమ్మం కాంగ్రెస్ ప్రచారానికి హీరో వెంకటేశ్! డేట్ ఫిక్స్?

by Ramesh N |
ఖమ్మం కాంగ్రెస్ ప్రచారానికి హీరో వెంకటేశ్! డేట్ ఫిక్స్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ఓ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఓ హీరో సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపుకోసం ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేష్ ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం. హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. వెంకీ ప్రచారంతో మరింత కలిసి వస్తుందని రఘురాం రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. దీంతో రఘురాంరెడ్డి పిలుపు మేరకు.. వియ్యంకుడి గెలుపు కోసం హీరో రంగంలోకి దిగినట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే మే 7న ఖమ్మంలో వెంకటేష్‌తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీంతో అటు కాంగ్రెస్, ‘వెంకీ మామ’ అభిమానుల్లో కోలాహలం మొదలైంది. కేవలం ఖమ్మం పార్లమెంట్ వరకు మాత్రమే వెంకీ ప్రచారం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు. ఆయన కూడా వియ్యంకుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మరి వీరి ప్రచారం అభ్యర్థి రఘురాం రెడ్డికి ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. కాగా, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో తీవ్ర పోటీ ఉండగా.. దాదాపు 20 రోజుల పాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య రఘురాంరెడ్డికి ఎంపీ టికెట్ అధిష్టానం ఖరారు చేసింది.

Advertisement

Next Story