Maoist : మావోయిస్టు వారోత్సవాల ఎఫెక్ట్.. ముమ్మరంగా పోలీసుల కూంబింగ్

by Rajesh |
Maoist : మావోయిస్టు వారోత్సవాల ఎఫెక్ట్.. ముమ్మరంగా పోలీసుల కూంబింగ్
X

దిశ, మంగపేట : మావోయిస్టు అమరుల వారోత్సవాలు ఆదివారం నుండి ఆగష్టు 3 వరకు జరగనున్నాయి. మండలంలోని కోమటిపల్లి, తొండ్యాల లక్ష్మీపురం, కొత్తూరు మొట్లగూడెం, బుచ్చంపేట, నర్సాయిగూడెం,బాలన్నగూడెం, నర్సింహాసాగర్, పూరెడుపల్లి, మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, నిమ్మగూడెం, దోమెడ పంచాయతీల పరిదిలోని అటవీ గ్రామాలలో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్ చేపట్టారు. వారం రోజుల పాటు మావోయిస్టు అమరులను స్మరిస్తూ వాడ వాడలలో వారోత్సవాలు జరిపి విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపద్యంలో పోలీసులు అడవులను గొత్తికోయ ఆవాసాలున్న అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

రంగంలోకి గ్రేహౌండ్స్ దళాలు :

మావోయిస్టు వారోత్సవాలను విఫలం చేసేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. మంగపేట మండలంతో పాటు ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు, వెంకటాపురం(నూగూరు)మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కేంద్ర బలగాలు గ్రీన్ హంట్ పేరుతో కూంబింగ్ నిర్వహిస్తుయి. మావోయిస్టుల్లో గొత్తికోయలున్నారనే సమాచారం మేరకు అటవీ ప్రాంతాల్లోని వారి ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని గూడాల్లో మావోయిస్టుల పాల్ పోస్టర్లు అంటించి సోదాలు, కార్డన్ సర్చ్ లు చేస్తూ అనుమానితుల సంచారం కోసం ఆరాతీస్తున్నారు. గొత్తికోయలతో సమావేశమై పరిచయంలేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరిస్తున్నారు.

ఎన్ కౌంటర్ తో రాజకీయ నాయకుల అప్రమత్తం :

ఈ నెల 25న జిల్లాలోని తాడ్వాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సరిహద్దు దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నల్లమారి అశోక్ @ విజెందర్ అనే మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భాద్యత వహించాలంటూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేర ప్రకటన విడుదల చేయడంతో పోలీసులు మండలంలోని అధికార పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో వారోత్సవాలు ముగిసే వరకు మండలంలో యాక్టివ్ గా ఉండే నాయకులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ అనుమతులు లేకుండా గ్రామాలకు వెళ్లవద్దని పర్యటనలను రద్దు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేసినపట్లు సమాచారం.

ఆందోళనతో అట్టుడుకుతున్న మండలం :

వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు మరోపక్క విఫలం చేసే పనితో పోలీసులు నిత్యం అటవీ గ్రామాల్లో సోదాలు తనిఖీలు చేస్తుండడంతో నిర్వహించడం మండలంలోని గిరిజన గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని యువకులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారక ముందే పోలీసులు తెల్లవార్లు మావోయిస్టుల భయం వెంటాడుతుండడంతో యువకులు గ్రామాలను విడిచిపోతున్నారు. మండలంలో గతంలో మావోయిస్టు ప్రాభల్యం ఉన్న కమలాపురం, తిమ్మంపేట, నర్సింహాసాగర్, రామచంద్రునిపేట, రాజుపేట పంచాయతీలపై పోలీసుల నిఘా పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు వారోత్సవాలు ముగిసే వరకు గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed