హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డులు ప్రాసెస్ స్పీడప్ చేయాలి: మంత్రి దామోదర

by Mahesh |
హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డులు ప్రాసెస్ స్పీడప్ చేయాలి: మంత్రి దామోదర
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల ప్రాసెస్ స్పీడప్ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బుధవారం ఆయన సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులు, వివిధ ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం సాయ పడాలన్నారు. ప్రజలను భయపెట్టేలా, వారికి ఇబ్బంది కలిగేలా సమాచార సేకరణ ఉండకూడదని మంత్రి సూచించారు. వారికి హెల్త్ ప్రొఫైల్ అవసరాన్ని వివరించి, వారి కన్సెంట్‌తోనే సమాచార సేకరణ జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. హెల్త్ ప్రొఫైల్‌లో ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించాలని, ఒకేసారి ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాదు అన్నారు. గతంలో ములుగు, సిరిసిల్లలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ విఫలమవడానికి ఇదే కారణమని మంత్రికి తెలిపారు. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

తొలుత ప్రజల వద్ద పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఏదైనా ఐడీ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వృత్తి వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో హెల్త్ కార్డులు తయారు చేయాలన్నారు. యూనిక్ నంబర్‌‌, ఫొటో, బార్ కోడ్‌తో ఈ కార్డులు ఉండాలన్నారు. ఆ తర్వాత వ్యక్తి బరువు, ఎత్తు, వృత్తి, బ్లడ్ గ్రూప్, బీపీ, షుగర్, గతంలో చేయించుకున్న ఆపరేషన్లు, కంటి సమస్యలు, దంత సమస్యలు, ఈఎన్‌టీ సమస్యలు, గతం తాలుక అనారోగ్య సమస్యలు, మద్యం, స్మోకింగ్, టొబాకో, తదితర అనారోగ్య కారక అలవాట్ల సమాచారాన్ని సేకరించి, ఆ వివరాలను హెల్త్ కార్డుల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కమిషనర్ కర్ణన్‌కు సూచించారు. ఆశలు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, డాక్టర్లతో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. దవాఖానాల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా హెల్త్ ప్రొఫైల్ తయారీ కార్యాచరణ ఉండాలన్నారు.

Advertisement

Next Story