Minister Uttam: కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

by Gantepaka Srikanth |
Minister Uttam: కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారాయని, వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా మాఫీ చేసేలా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ(Central Government)రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా వడ్డీని క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత మండపంలో మంగళవారం నుంచి జరుగుతున్న 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సుకు హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సుకు మంత్రితో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనున్నది. ఈ సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఇరిగేషన్ సెక్టార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు కావాల్సిందిగా ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్టు చేశారు. దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించిందని, అదే తరహాలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని ఇరగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల రూపంలో సాయం అందడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరిగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తరఫున సాఫ్ట్ లోన్‌ను మంజూరు చేయాల్సిందిగా ఆ రెండు సంస్థల ప్రతినిధులతో ఈ సదస్సులో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమ్మక్క-సారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం చత్తీస్‌గడ్ రాష్ట్ర పరిధిలో ఉన్నదని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్‌ఓసీ అందాల్సి ఉంటుందన్నారు. కేంద్రం నుంచి క్లియరెన్సులు రావడానికి ఈ ఎన్ఓసీ తప్పనిసరి అని, అందువల్ల ఆ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో మంత్రి ఉత్తమ్ చర్చించారు.

ఛత్తీస్‌గడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వమూ చొరవ తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ఈ విషయంతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత అప్పులపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం లేదా తగ్గించాలని, చత్తీస్‌గడ్ నుంచి ఎన్ఓసీ లభించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాల్సిందిగా మంత్రి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఇండియా వాటర్ వీక్ ప్రోగ్రామ్‌లో 40 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed