వలసలను కట్టడి చేయడంలో TPCC చీఫ్ ఫెయిల్ అయ్యారా?

by GSrikanth |   ( Updated:2022-11-25 04:38:33.0  )
వలసలను కట్టడి చేయడంలో TPCC చీఫ్ ఫెయిల్ అయ్యారా?
X

వలసలను కట్టడి చేయడంతో పీసీసీ చీఫ్ రేవంత్ ఫెయిల్ అయ్యారా? పక్కా ప్లాన్ ప్రకారమే గిట్టని వారిని పార్టీ నుంచి పంపించి వేస్తున్నారా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్న శ్రవణ్ దాసోజు.. నిన్న బొమ్మ శ్రీరాం.. నేడు మర్రి శశిధర్ రెడ్డి, రామారావు పటేల్ ఇలా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వీడటం విశేషం. రేవంత్ పీసీసీ చీఫ్​ బాధ్యతలు చేపట్టాక ఆరుగురు రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీ వీడటం గమనార్హం.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వలసలు పెరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం గిట్టని లీడర్లను పంపించే పనిలో రేవంత్ బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే సీనియర్లు రాజీనామాలు చేస్తున్నా మౌనముద్ర దాల్చరనే విమర్శలున్నాయి. అసమ్మతి లీడర్లకు చెక్ పెట్టడం, సీనియర్లను అవమానపర్చడంపై పెట్టే ఫోకస్ పార్టీ బలోపేతంపై ఉంచడం లేదనే ఆరోపనలున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ పెంచే కార్యక్రమాలు తప్పా, పార్టీకి పనికివచ్చే ప్రోగ్రామ్స్ చేయడం లేదనే చర్చ జరుగుతున్నది. తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ రామారావు పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు.

కేఎల్ఆర్‌తో మొదలు

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన మరుక్షణమే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ తో తను పని చేయ్యలేనని, అందుకే పార్టీ వీడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. వీరద్దరు కూడా రేవంత్ ఎంపీగా ప్రాతనిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తారు. సొంత నియోజకవర్గంలోని లీడర్లతో సఖ్యత కుదర్చుకోవడంలో రేవంత్ ఫెయిలయ్యారని, పార్టీలో ఉన్న సీనియర్లతో ఎలా సర్దుకుంటారని టాక్ అప్పట్లోనే జరిగింది.

పక్కా ప్లాన్ ప్రకారం దాసోజుకు చెక్

రేవంత్ టీమ్ ఇబ్బందులు పెట్టడంతోనే దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రచారం ఉంది. ఏఐసీసీ స్పోక్ పర్సన్ గా ఉన్న దాసోజు శ్రవణ్.. రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సార్లు ఇబ్బంది పడ్డారు. దాసోజుకు తెలియకుండానే ఆయన సెగ్మెంట్ ఖైరతాబాద్​ కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఇస్తానని హామి ఇచ్చినట్టు ప్రచారం ఉంది. ఈ కారణంగానే దాసోజు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదానికి రేవంత్ కారణం?

పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. తన అన్నకు పీసీసీ పదవి వస్తే తను కాంగ్రెస్ లో ఉండాలని రాజగోపాల్ రెడ్డి భావించారు. రేవంత్ కు పీసీసీ చీఫ్​ పదవి కట్టబెట్టడంతో తీరు మారింది. ఇక కాంగ్రెస్ లో కొనసాగలేమని నిర్ణయానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చినట్టు ప్రచారం ఉంది. ఈ క్రమంలో జరిగిన మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వెంకటరెడ్డిపై చేసిన కామెంట్స్ విషయంలో రేవంత్ ప్రొత్సాహం ఉందని పార్టీ లీడర్లు ఇప్పటికి చెప్తుంటారు. అందుకే ఆయనపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటారు. ఇక వెంకటరెడ్డితో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటానంటూ రేవంత్ ఆయన ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఓ అంతర్గత సమావేశాల్లో తనను ఉద్దేశించి రేవంత్ చేసిన కామెంట్స్ తెలుసుకున్న వెంకట్ రెడ్డి తీవ్రంగా ఆవేదన చెందారని సమాచారం.

మర్రి శశిధర్ విషయంలో మౌనంగా రేవంత్

పార్టీలో చాలా సీనియర్ లీడర్‌గా పేరున్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారనే సమాచారం తెలిసినా రేవంత్ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మర్రి ఇంట్లో రెండు నెలల క్రితం అసమ్మతి లీడర్ల సమావేశం జరిగింది. ఆ టైమ్ లోనే పార్టీలో సీనియర్లకు మర్యాద లేదంటూ మర్రి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ టీం పనికట్టుకుని ఓ ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో సీనియర్లపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నదని అన్నారు. ఇంత జరిగినా రేవంత్ మర్రితో మాట్లాడే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. పైగా సీనియర్లు ఇంకా ఎంత కాలం పార్టీలో ఉంటారు? అనే కామెంట్స్ చేసినట్టు ప్రచారం ఉంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ రామారావు విషయంలోనూ రేవంత్ పట్టించుకోలేదని టాక్ ఉంది.

పార్టీ వీడిన బొమ్మ శ్రీరాం,పల్లె రవి

కాంగ్రెస్‌లోని బీసీ లీడర్లను రేవంత్ టార్గెట్ చేస్తున్నట్టు విమర్శలున్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మంట్ లో చాలా కాలంగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కొడుకు బొమ్మ శ్రీరాం పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. దీంతో శ్రీరాం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. మునుగోడు బై ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ టికెట్ ను ఆశించిన పల్లె రవికుమార్ కూడా హస్తం పార్టీకి బైబై చెప్పేశారు.

చేరికలు లేవు.. వలసలే మిగలాయి

రేవంత్ వచ్చిన తర్వాత పార్టీలో చేరికలు లేవని టాక్ ఉంది. ఇతర పార్టీల లీడర్లను పార్టీలో చేర్చుకునేందుకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. కాని ఆ కమిటీ చేరికలపై పెద్దగా కసరత్తు చేసిన దాఖలాలు లేవు. అయితే అత్యంత రహస్యంగా ఢిల్లీకి తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు.

సీనియర్లతో కుదరని సఖ్యత

రేవంత్‌కు కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సఖ్యత రావడం లేదు. వీహెచ్, గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క,మధుయాష్కీ,దామోదర్ రాజనర్సింహ, ఇతర సీనియర్ లీడర్లతో సంబంధాలు అంతంత మాత్రమే. మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతిసారి రేవంత్ తీరుతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

పోస్ట్ మార్టం లేదు.. యాక్షన్ పొగ్రామ్స్ లేవు

హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్‌లో పార్టీకి డిపాజిట్ దక్కలేదు. అసలు ఎక్కడ లోపం జరిగింది? ఎవరి వల్ల జరిగింది? పరిష్కారం ఏంటి? అనే విషయాలపై కాంగ్రెస్ లో సమీక్షలు లేవు. అలాగే వచ్చే ఎన్నికల కోసం కసరత్తులూ లేవు. ఓ వైపు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్దం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. చాలా మందికి ఆసరా పెన్షన్ రావట్లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ లేదు. నోటిఫికేషన్ల విడుదల లేదు. ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం లేదు.. ఇన్ని సమస్యలు ఉన్నా కాంగ్రెస్ వాటిపై పోరాడేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది.

Read more:

1.బ్రేకింగ్స్ న్యూస్: ఐటీ దాడుల వ్యవహారంలో కీలక పరిణామం...మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మొత్తం దొరికిన బంగారం, నగదు ఎంతో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed