టీఎస్ ఆర్టీసీ కబడ్డీ టోర్నమెంట్‌లో హర్యానా జ‌ట్టు గెలుపు

by sudharani |
టీఎస్ ఆర్టీసీ కబడ్డీ టోర్నమెంట్‌లో హర్యానా జ‌ట్టు గెలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌‌లోని హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో నిర్వహించిన అఖిల భార‌త ర‌వాణా సంస్థల క‌బ‌డ్డీ టోర్నమెంట్‌లో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ టోర్నమెంట్‌ శనివారం సాయంత్రంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించగా.. ఈ పోటీలకు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా ర‌వాణా సంస్థలకు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్ వేస్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ జట్లు తలపడ్డాయి.

ఈ పోటీలో హర్యానా జట్టు ఛాంపియన్‌గా.. బెంగళూరు జట్టు రన్నర్‌గా ప‌త‌కాలు అందుకోగా మూడో స్థానంలో మ‌హ‌రాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది. ముగింపు వేడుకలకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరై.. మొద‌ట మూడు స్థానాల్లో నిలిచిన హ‌ర్యానా (బంగారు), బెంగ‌ళూరు (ర‌జ‌తం), మ‌హ‌రాష్ట్ర (కాంస్యం) జట్ల సభ్యులకు ట్రోపీలు, మెడ‌ల్స్‌, ప్రశంసాపత్రాలను బ‌హూక‌రించి అభినందించారు. టోర్నమెంట్​లో పాల్గొన్న టీం స‌భ్యుల‌కు సర్టిఫికేట్లను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ప్రజా ర‌వాణా సంస్థలో ప‌ని చేసే ఉద్యోగులు క్రీడ‌ల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం గొప్ప విష‌య‌మ‌ని కొనియాడారు. ఆట‌లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని.. ప‌ట్టుద‌ల‌, కృషి ఉంటే క్రీడ‌ల్లో రాణించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed