రుణమాఫీ కాలేదని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు : మాజీ మంత్రి హరీష్ రావు

by M.Rajitha |
రుణమాఫీ కాలేదని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు : మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘మీ పార్టీ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదు అంటున్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో... ఎవరు ఏటిలో దూకి చావాలో... ఎవరికి చీము నెత్తురు లేదో... ఎవరు అమర వీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలో... ఎవరు రాజీనామా చేయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని’ అని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా సీఎంపై ఫైర్ అయ్యారు. కోదండ రెడ్డి, కోదండరాం రెడ్డి, ఆది శ్రీనివాస్ ముగ్గురు ఒప్పుకుంటున్నది రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని. తాను అదే చెప్పానని, రాష్ట్రంలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగింది అని అన్నారు. 31 వేల కోట్లు అని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని తానంటే ఎందుకు రంకెలేస్తున్నారని నిలదీశారు. రుణమాఫీ పూర్తయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారని, ఎందుకు సీఎం, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం, తొండి చేసైనా తామే గెలిచినం అనే వైఖరి ప్రదర్శించడం అవివేకం అవుతుందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, రుణమాఫీ ప్రక్రియను తూతూ మంత్రంగా కాకుండా సమగ్రంగా పూర్తి చేయాలని, రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు.

Next Story

Most Viewed